Komaram Bheem: భార్యపై ఉన్న కోపంతో అత్తగారి ఇంటికి నిప్పు పెట్టిన అత్యంత దారుణమైన సంఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని లింగాపూర్ మండలం ఎల్లాపటార్‌లో జరిగింది.
ఎల్లాపటార్ గ్రామానికి చెందిన షమాబీకి, జైనూరు మండల కేంద్రానికి చెందిన ముజాహిద్ బేగ్‌తో కేవలం తొమ్మిది నెలల క్రితమే వివాహం జరిగింది. పెళ్లయినప్పటి నుంచి ముజాహిద్ తరచూ తన భార్య షమాబీతో “నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు” అంటూ గొడవలు పడుతూ వచ్చేవాడు. భర్త నిత్యం కలహాలు సృష్టించడంతో, షమాబీ సుమారు ఇరవై రోజుల క్రితం అలిగి తన పుట్టింటికి (ఎల్లాపటార్‌కు) వెళ్లిపోయింది.
Also Read: India: రష్యా చమురు కొనుగోళ్లపై ట్రంప్ వ్యాఖ్యలు: గట్టి కౌంటర్ ఇచ్చిన భారత్
గురువారం రోజున ముజాహిద్ ఎల్లాపటార్‌లోని అత్తింటికి వచ్చాడు. అక్కడ మళ్లీ తన భార్యతో తీవ్ర స్థాయిలో గొడవకు దిగాడు. కోపం పట్టలేకపోయిన ముజాహిద్, ఆవేశంలో ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి, గ్యాస్ సిలిండర్ పైపును లీక్ చేసి, వెంటనే నిప్పంటించాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు.
గ్యాస్ లీకేజీ కారణంగా మంటలు అతి వేగంగా వ్యాపించాయి, దీంతో ఇల్లు పూర్తిగా కాలి బూడిదైంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, పారిపోయిన ముజాహిద్ బేగ్ కోసం దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై గంగన్న తెలిపారు.