Konda Lakshma Reddy: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి(84) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం ఆరు గంటల సమయంలో హైదర్గూడ లోని అపోలో ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. మహా ప్రస్థానంలోఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. కొండా లక్ష్మారెడ్డి1983 – 1985 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి మనవడు.
ఇది కూడా చదవండి: AP Weather: ఏపీలో మరో మూడు రోజులు.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన అతి భారీ వర్షాలు
ఆయన తన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు.1999, 2014 సంవత్సరాలలో హైదరాబాద్ స్థానం నుంచి కూడా ఆయన ఎన్నికల్లో పోటీ చేశారు. జర్నలిజం పట్ల మక్కువతో ఆయన 1980లో స్థానిక వార్తా సంస్థ NSSను ప్రారంభించారు. జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ, ప్రెస్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి మరణ వార్త తెలుసుకున్న పలువురు తెలుగు రాజకీయ నేతలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొండా లక్ష్మారెడ్డి మరణంతో చేవెళ్ల ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.