Mexico: ఉత్తర అమెరికా దేశం మెక్సికోలో భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాయి, వాహనాలు కొట్టుకుపోయాయి. పెద్ద ఎత్తున చెట్లు నేలకొరిగాయి. వరదల వల్ల జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో హిడాల్గో రాష్ట్రంలోనే 16 మరణాలు నమోదయ్యాయి. వేల ఇళ్లు, 59 ఆసుపత్రులు, 308 పాఠశాలలు దెబ్బతిన్నాయి. 84 మున్సిపాలిటీలలో 17 విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్యూబ్లా రాష్ట్రంలో తొమ్మిది మంది మరణించారు. 13 మంది గల్లంతయ్యారు.
ఇది కూడా చదవండి: Gold Rate Hike: భారతదేశ ప్రజల వద్ద ఎంత బంగారం ఉంది? దాని విలువ ఎంతో తెలుసా?
భారీ వర్షాల వల్ల సుమారు 80 వేల మంది ప్రభావితమయ్యారని అధికారులు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో 8 వేల 700 మందికి పైగా సైనిక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారని చెప్పారు. పలుచోట్ల వరద ప్రభావం తగ్గడంతో బురద తొలగింపు పనులు కొనసాగుతున్నాయి.
మరోవైపు అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో మిలిటరీ యుద్ధసామగ్రి ప్లాంట్ లో జరిగిన పేలుడులో 16 మంది మృతి చెందినట్టు అధికారులు ప్రకటించారు. శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీసినట్టు చెప్పారు. పేలుడు ఘటనలో ఎవరూ ప్రాణాలతో బయటపడలేదని తెలిపారు. శుక్రవారం టెన్నెస్సీలోని మిలిటరీ యుద్ధ సామగ్రి ప్లాంట్ లో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ తీవ్రతకు ఒక్కసారిగా సమీపంలో ఉన్న కార్లు ఎగిరిపడ్డాయి. ఆకాశంలో దట్టమైన పొగ వ్యాపించింది. పేలుడుకు స్పష్టమైన కారణాలు ఇంకా తెలియదని..అధికారులు పేర్కొన్నారు. ఘటనాస్థలికి FBI చేరుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు