IPS Officer Suicide

IPS Officer Suicide: గన్‌తో కాల్చుకుని సీనియర్ IPS ఆఫీసర్ ఆత్మహత్య.. సూసైడ్ నోట్ లభ్యం

IPS Officer Suicide: హర్యానా రాష్ట్రంలో చోటుచేసుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. సీనియర్ అధికారి వై. పురాన్ కుమార్ తన నివాసంలో గన్‌తో కాల్చుకుని మంగళవారం (అక్టోబర్ 7) ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో పోలీసులు పరిశీలనలు జరిపారు. ఈ ఘటనలో అత్యంత షాకింగ్ అంశం.ఆయన జేబులో లభించిన 9 పేజీల సూసైడ్ నోట్, ఇందులో 12 మంది అధికారులు తనను మానసికంగా వేధించారని పురాన్ కుమార్ ఆరోపించారు.

12 మంది అధికారుల పేర్లతో సంచలన ఆరోపణలు

సూసైడ్ నోట్‌లో 7–8 మంది ఐపీఎస్‌లు, ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నట్లు సమాచారం. వీరు తనపై కుల ఆధారిత వివక్ష చూపారని, ఉద్దేశపూర్వకంగా మానసికంగా వేధించారని పేర్కొన్నారు. ప్రభుత్వ వసతి నిరాకరణ, పనితీరు నివేదికల్లో అవకతవకలు, నిరంతర ఒత్తిడి కారణంగా తనను అవమానపరిచారని నోట్‌లో రాశారు. తన ఆస్తి మొత్తాన్ని భార్యకు బదిలీ చేస్తున్నట్లు కూడా ఆయన నోట్‌లో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Video Viral: అమెరికాలో పాయింట్ బ్లాంక్‌లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగుడు

భార్య ఫిర్యాదుతో కొత్త మలుపు

మరణించిన అధికారి భార్య, ఐఏఎస్ అధికారి అమ్నీత్ పి కుమార్, ఈ ఘటనపై చండీగఢ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్, రోహ్తక్ ఎస్పీ నరేంద్ర బిజార్నియా వంటి ఉన్నతాధికారులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

తన భర్తపై తప్పుడు అవినీతి కేసులు నమోదు చేసి, కులం పేరుతో అవమానించారని, క్రమంగా మానసిక ఒత్తిడి కలిగించారని ఆమె పేర్కొన్నారు. ఈ చర్యలన్నీ డీజీపీ ఆదేశాల ప్రకారమే జరిగాయని, ఇది ఒక ఉద్దేశపూర్వక కుట్ర అని ఆమె ఫిర్యాదులో స్పష్టం చేశారు.

దర్యాప్తు వేగవంతం

పురాన్ కుమార్ ఆత్మహత్య ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం కీలక ఆధారాలను సేకరించింది. సంఘటనను వీడియో, ఫోటో రూపంలో నమోదు చేశారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలాలు సేకరిస్తున్నారు.

అయితే సూసైడ్ నోట్‌లో పేర్కొన్న నిందితుల పూర్తి వివరాలను పోలీసులు ఇంకా బహిర్గతం చేయలేదు.
ఈ ఘటన హర్యానా ప్రభుత్వ వర్గాల్లో పెద్ద కలకలానికి దారితీసింది. ఐపీఎస్ అధికారి ఆత్మహత్య వెనుక ఉన్న నిజాలు వెలుగులోకి రావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *