High Court: బీసీ రిజర్వేషన్ల అంశంపై ఈ రోజు (అక్టోబర్ 8న) హైకోర్టులో విచారణపై అంతటా ఉత్కంఠ నెలకొన్నది. ఈ దశలో విచారణ ప్రారంభం కాగానే కీలక పరిణామం చోటుచేసుకున్నది. విచారణ ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. తిరిగి ఇదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
High Court: బీసీ రిజర్వేషన్ పిటిషన్‌ను కొందరు న్యాయవాదులు మెన్షన్ చేశారు. దీంతో విచారణలో భాగంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందని హైకోర్టు ధర్మాసనం వాదప్రతివాదులను అడిగింది. బీసీ రిజర్వేషన్లపై 28 ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. అన్ని పిటిషన్ల కలిపి ఒకేసారి విచారిస్తామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రఖ్యాత అడ్వకేట్ అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించనున్నారు.
High Court: ఇదిలా ఉండగా, రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, బీసీలు రగిలిపోతున్నారు. తమకు ఇచ్చిన రిజర్వేషన్ల అవకాశంపై పిటిషన్ వేసి నీళ్లు చల్లడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతోపాటు హైకోర్టు వద్ద బీసీ న్యాయవాదులు, బీసీ నేతలు, బీసీ సంఘాల ప్రతినిధుల కోలాహలం నెలకొని ఉన్నది. తమ నోటికాడి కూడును కొల్లగొట్ట వద్దని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఓ దశలో అక్కడ నినాదాలు చోటుచేసుకోవడం గమనార్హం.