BRS Protest In Bus: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) బస్సు టికెట్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ (BRS) పార్టీ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తాము కూడా బస్సెక్కి, ప్రయాణం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ బస్ స్టాప్ నుంచి అసెంబ్లీ బస్ స్టాప్ వరకు బస్సులో ప్రయాణించి, పెంచిన బస్సు ఛార్జీలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు.
“మహిళలకు ఫ్రీ ఇచ్చి, మగవారి నుంచి డబుల్ వసూలు!”
ఈ నిరసన కార్యక్రమంలో ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచి సామాన్యుడిపై పెద్ద భారం మోపిందని ఆరోపించారు.
“ఒక్కో టికెట్‌పై సుమారు రూ. 10 పెంచి, నెలకు రూ. 500 నుంచి 600 రూపాయల అదనపు భారాన్ని సామాన్య ప్రజలపై వేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఇప్పుడు అన్ని రకాల ధరలను పెంచుతున్నారు. ఆర్టీసీ ఛార్జీలతో పాటు మొన్న వాహనాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అంతకుముందు మద్యం ధరలు కూడా పెంచారు. ఈ విధంగా ఛార్జీలు పెంచి సామాన్యుల జీవితాన్ని నరకం చేస్తున్నారు,” అని విమర్శించారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ, “ఒకవైపు మహిళలకు ఉచిత సౌకర్యం అంటూనే, మరోవైపు మగవారిపై బస్సు ఛార్జీలు పెంచి, రెండు భారాలను సమానం చేశారు. సామాన్య ప్రజలకు నిజమైన ఊరట దక్కాలంటే మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సిందే,” అని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు.
“పేద ప్రజానీకంపై బండరాయి వేసినట్టే”
ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పేద ప్రజానీకంపై పెద్ద బండరాయి వేసినట్టు అయిందన్నారు.
“సామాన్య ప్రజలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సులనే ఆశ్రయిస్తారు. అలాంటిది బస్సుల్లో విపరీతమైన ఛార్జీలు పెంచి, వాళ్ల జేబులు ఖాళీ చేసే ప్రయత్నం చేస్తోంది ఈ ప్రభుత్వం. డీజిల్ ఛార్జీలు తగ్గినప్పటికీ, ఆర్టీసీ ధరలను ఇంత పెద్ద ఎత్తున పెంచడం చాలా ఘోరం,” అని ఆయన మండిపడ్డారు.
అంతేకాకుండా, “రూ. 100 కోట్లు ఆదాయం వచ్చే ఆర్టీసీ కార్గో సేవలను కూడా వేరే కంపెనీకి కేవలం రూ. 36 కోట్లకే అప్పగించారు. అదే ఆదాయాన్ని ప్రభుత్వం తీసుకుని ఉంటే, పేద ప్రజలపై ఇంత భారం పడకుండా చూసుకోవచ్చు కదా? ఇంత పెద్ద మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలి,” అని ముఠా గోపాల్ కోరారు. రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.