Bihar Elections 2025 Schedule

Bihar Elections 2025 Schedule: బిహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

Bihar Elections 2025 Schedule: దేశంలో అత్యంత కీలకంగా భావించే బిహార్ అసెంబ్లీ సాధారణ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) సోమవారం విడుదల చేసింది. మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. బిహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగుస్తుండగా, ఈ తేదీలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.

బిహార్ ఎన్నికల పూర్తి షెడ్యూల్ వివరాలు:

విడత పోలింగ్ తేదీ
మొదటి విడత పోలింగ్ నవంబర్ 06
రెండో విడత పోలింగ్ నవంబర్ 11
ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) నవంబర్ 14

బిహార్ రాష్ట్రంలో మొత్తం 7 కోట్ల 43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 3 కోట్ల 92 లక్షల మంది పురుషులు, 3 కోట్ల 50 లక్షల మంది మహిళలు, 1,725 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఉన్నారు.

  • జనరల్ సీట్లు: 203
  • ఎస్సీ (SC) కేటగిరీ సీట్లు: 38
  • ఎస్టీ (ST) కేటగిరీ సీట్లు: 2
  • మొత్తం పోలింగ్ కేంద్రాలు: 90,712
    • గ్రామీణ ప్రాంతాల్లో (రూరల్) – 76,801
    • పట్టణ ప్రాంతాల్లో (అర్బన్) – 13,911

పోలింగ్ కేంద్రాల్లో రద్దీని తగ్గించేందుకు, ప్రతి పోలింగ్ కేంద్రానికి సరాసరి 818 ఓట్లను కేటాయించారు. పోలింగ్ బూత్ బయట మొబైల్ ఫోన్ భద్రపరుచుకునేలా ఏర్పాట్లు కూడా చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు

ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది:

  1. వెబ్ క్యాస్టింగ్: అన్ని పోలింగ్ కేంద్రాలను (100 శాతం) వెబ్ క్యాస్టింగ్ చేయనున్నారు. అలాగే, సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు.
  2. కొత్త కార్యక్రమాలు: బిహార్ ఎన్నికల కోసం మొత్తం 17 కొత్త కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. భవిష్యత్తులో ఈ చర్యలు దేశవ్యాప్తంగా అమలు చేయబడతాయి.
  3. బ్యాలెట్‌పై కలర్ ఫోటోలు: దేశంలోనే తొలిసారిగా, ఓటర్లు అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు వీలుగా బ్యాలెట్‌పై అభ్యర్థుల కలర్ ఫోటోలను ముద్రించనున్నారు.
  4. నిఘా: సోషల్ మీడియా పోస్టులపై, శాంతిభద్రతల నిర్వహణపై గట్టి నిఘా ఉంచారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే 1950కు ఫోన్ చేయాలని లేదా నియమించిన 243 మంది అబ్జర్వర్లను సంప్రదించాలని ఈసీ సూచించింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా విడుదల

బిహార్ ఎన్నికల షెడ్యూల్‌తో పాటే తెలంగాణ రాష్ట్రంలోని కీలక నియోజకవర్గం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్‌ను కూడా కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది.

  • పోలింగ్ తేదీ: నవంబర్ 11
  • కౌంటింగ్ తేదీ: నవంబర్ 14

ఈ ప్రకటనతో హైదరాబాద్‌లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది.

బిహార్‌లో కీలక పోరు

ప్రస్తుతం బిహార్‌లో ఎన్డీఏ కూటమి (జేడీయూ – బీజేపీ) అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి, ప్రతిపక్ష ఇండియా కూటమి (కాంగ్రెస్, ఆర్జేడీ) మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ఎంఐఎం, ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా కొన్ని స్థానాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *