Bandi vs Eetala War

Bandi vs Eetala War: క్లైమ్యాక్స్‌కు చేరిన బండి, ఈటెల కొట్లాట..

Bandi vs Eetala War: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పార్టీ నుండి కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్, మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్‌ల మధ్య విభేదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య వర్గపోరు నడుస్తుండగా, ఆ మధ్య ఒకరికొకరు పేర్లు ప్రస్తావించకుండానే డైలాగ్ వార్‌కి దిగారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి విభేదాలు బహిర్గతమయ్యాయి. బీజేపీలో ఉన్నది ఒక్కటే మోడీ గ్రూపు అని పదేపదే చెబుతున్నా… హుజురాబాద్ నియోజకవర్గంలో మాత్రం బండి, ఈటెల వర్గాలుగా విడిపోయాయి బీజేపీ శ్రేణులు. అయితే ఇప్పుడు ఇదే వర్గపోరు ఈటెల రాజేందర్‌కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

వాస్తవానికి ఈటెల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉన్నా, హుజురాబాద్ నియోజకవర్గంతో ఈటెల రాజేందర్‌కి విడదీయరాని అనుబంధం ఉంది. ఇక్కడి నుండి బీఆర్ఎస్‌లో కీలకంగా ఉండి, విభేదాల కారణంగా బీజేపీలో చేరి కాషాయ కండువా కప్పుకున్నాడు. ఉప ఎన్నికలలో కేసీఆర్‌తో సై అంటే సై అని ఘన విజయం సాధించాడు. కానీ తరువాత జరిగిన పరిణామాలతో హుజురాబాద్ ఎన్నికలలో ఓడిపోవడం, మల్కాజిగిరిలో పోటీ చేసి ఎంపీగా గెలవడం జరిగిపోయాయి. అయితే శాసనసభ ఎన్నికల్లో హుజురాబాద్‌లో ఓడిపోయాక నియోజకవర్గ ప్రజల మీద, నాయకుల మీద కినుక వహించి, చాలా రోజులు హుజురాబాద్‌కి దూరంగా ఉండిపోయాడు. కానీ తాను బీజేపీలో చేరిన తరువాత హుజురాబాద్‌లో క్యాడర్ బలంగా తయారైందని, కరీంనగర్ పార్లమెంటులో బండి సంజయ్‌ గెలుపుకు హుజురాబాద్ నియోజకవర్గంలో ఎక్కువ మెజారిటీ రావడమే కారణమన్నది ఈటెల అభిప్రాయం. కానీ జిల్లా, మండల కమిటీల నియామకంలో ఈటెల రాజేందర్ అనుచరులకి ప్రాతినిధ్యం దక్కకపోవడంతో అప్పట్లో చాలా ఘాటుగానే విమర్శలు చేశాడు ఈటెల. “బిడ్డా… నా చరిత్ర నీకు తెల్వది… నీ చరిత్ర ఏంది, మా చరిత్ర ఏంది…? నా చరిత్ర నీకు తక్కువగా తెలుసు. రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్ లాంటి వారితోనే కొట్లాడినోన్ని, నీ పతార ఏంది?” అని ఘాటు వ్యాఖ్యలు చేసిన ఈటెల…. రేపు జరుగబోయే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లుగా తనవారే ఉంటారని ఆనాడే తెలిపాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలతో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

Also Read: Babu Warn Balayya: నోటీ తీట ఎమ్మెల్యేలకు సీఎం వార్నింగ్‌.. బాలకృష్ణకూ వర్తిస్తుంది!

తాజాగా మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్‌పై హుజురాబాద్ పార్టీ శ్రేణులు రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశాయి. శామీర్‌పేటలోని ఈటెల నివాసంలో చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సద్దుమణగలేదు. ఇప్పుడు దసరా పండుగకి కమలాపూర్‌లోని ఇంటికి వచ్చిన ఈటెల రాజేందర్‌ వద్ద ఆయన అనుచరులు స్థానిక సంస్థల ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చారు. “టికెట్ రాకపోతే ఎవరూ బాధపడవద్దనీ, అవసరమైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లాంటి పార్టీల నుండి టికెట్ ఇప్పించి గెలిపించుకుంటాననీ అని హామీ ఇవ్వడం ఇప్పుడు పార్టీలో కలకలం రేపింది. జాతీయ పార్టీ బీజేపీలో ఉంటూ మరో పార్టీ నుండి టికెట్ ఇప్పిస్తానని ఎలా హామీ ఇస్తాడని హుజురాబాద్ బిజేపీ క్యాడర్ మండిపడుతున్నారు. కొత్త నాయకులు, పాత నాయకులు అంటూ ఆ వర్గం, ఈ వర్గం అంటూ విభజిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “హుజురాబాద్‌లో ఉంది బీజేపీయే కానీ, ఈటెల సొంత దుకాణం కాదు” అంటూ చర్చించుకుంటున్నారు. అయితే ఈటెల వ్యాఖ్యలని సీరియస్‌గా తీసుకున్న కరీంనగర్ బిజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటుగా మరికొంతమంది నాయకులు రాష్ట్ర అధ్యక్షుడిని కలిసి తమ ఆవేదనని తెలియజేశారట. హుజురాబాద్‌లో బీజేపీలో విభేదాలు సృష్టిస్తూ పార్టీని బలహీనపరుస్తున్నారని, వ్యక్తిగతంగా సొంత అనుచరులని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారట. అంతర్గత విభేదాలు ఇలాగే కొనసాగితే ఈటెల ప్రవర్తన వల్ల పార్టీకి ముప్పు వాటిల్లుతుందని, ఈటెల రాజేందర్‌ని కట్టడి చేయాలని కోరారట.

గతంలో కంటే ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు సెగ్మెంట్‌లో బీజేపీ బలంగా తయారైంది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఇప్పుడు కేంద్ర మంత్రి అయ్యాక, గ్రామాలలో క్రింది స్థాయి నుండి పార్టీని బలంగా నిర్మాణం చేశారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ స్థానాలని కైవసం చేసుకోవాలని, అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్లమెంటు పరిధిలో పార్టీని బలంగా తయారు చేయాలని బండి సంజయ్ గ్రౌండ్ వర్క్ చేస్తుండగా, ఈటెల మార్క్ రాజకీయాల కారణంగా… పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీజేపీ క్యాడర్, లీడర్లు. దీనివలన స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతికూల ఫలితాలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్‌పై వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *