Taliban: ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ ఈ నెల అక్టోబరు 10 తేదీన భారత్ లో పర్యటించనున్నారు. తాలిబాన్ 2021లో ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఒక సీనియర్ తాలిబాన్ అధికారి భారత్ ను సందర్శించడం ఇదే మొదటిసారి. రెండు దేశాల మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలు, భారతదేశం అందిస్తున్న మానవతా సహాయం గురించి చర్చించే అవకాశం ఉంది. అక్టోబరు 10న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో ముఖాముఖి చర్చలు జరిగే అవకాశం ఉంది. ముత్తాఖీ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) ఆంక్షల జాబితాలో ఉన్నారు, కాబట్టి అతను విదేశాలకు వెళ్లాలంటే UNSC యొక్క 1988 ఆంక్షల కమిటీ నుండి ప్రత్యేక అనుమతి అవసరం. సెప్టెంబర్ 30, 2025న ఈ అనుమతి లభించింది. భారత్ ఇంకా తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించనప్పటికీ, ఈ పర్యటన రెండు దేశాల మధ్య పెరుగుతున్న సంబంధాలకు, సంప్రదింపులకు సంకేతం. గతంలో ఈ ఏడాది జనవరిలో దుబాయ్‌లో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, మే నెలలో విదేశాంగ మంత్రి జైశంకర్ ముత్తాఖీతో మాట్లాడారు.కాగా 2021లో అమెరికా మద్దతు ఉన్న అష్రఫ్ ఘనీ ప్రభుత్వంపై తాలిబాన్లు తిరుగుబాటు చేసి, అధికారాన్ని చేపట్టారు. తాలిబాన్ పాలను అధికారంగా గుర్తించిన తొలి దేశంగా రష్యా నిలిచింది. ఆఫ్ఘన్ వ్యాప్తంగా భారత్ భారీ పెట్టుబడులు పెట్టింది. మౌలిక సదుపాయాలు, పాఠశాలలు, ఆస్పత్రుల్ని కట్టించింది.
