White House: అమెరికాలో ఉన్నత విద్య కోసం ట్రంప్ కార్యవర్గం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. అమెరికా ప్రభుత్వం నుంచి నిధులు (Government Funds) పొందాలనుకునే విశ్వవిద్యాలయాలు పాటించాల్సిన షరతులను వివరిస్తూ శ్వేతసౌధం (White House) దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలకు మెమో రూపంలో పంపింది. ప్రభుత్వ లబ్ధి (అంటే విద్యార్థులకు రుణాలు, రీసెర్చ్ గ్రాంట్లు, కాంట్రాక్టులు, వీసా అనుమతులు) పొందాలంటే, యూనివర్సిటీలు కొన్ని కీలకమైన మార్పులు చేయాల్సి ఉంటుంది.
అమెరికాలో ఉన్నత విద్య వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించి, తమ భావజాలానికి అనుగుణంగా మార్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని కార్యవర్గం ఈ చర్యలు చేపట్టినట్టుగా భావిస్తున్నారు. ఈ లేఖలు హార్వర్డ్, ఎంఐటీ (MIT) వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలకు అందాయి. ప్రభుత్వంతో హార్వర్డ్ యూనివర్సిటీ సుమారు 500 మిలియన్ డాలర్ల డీల్‌కు చేరువలో ఉంది. ఈ కొత్త నిబంధనలు ఏ మేరకు అమలు చేస్తున్నారనే అంశాన్ని జస్టిస్ డిపార్ట్‌మెంట్ సమీక్షిస్తుంది. ఈ షరతులను ఉల్లంఘించినట్లు తేలితే, ఆ విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వ లబ్ధిని రెండేళ్లపాటు నిలిపివేస్తారు.
Also Read: Putin: భారత్ అవమానాన్ని అంగీకరించదు.. పుతిన్ కీలక కామెంట్స్
ప్రభుత్వ నిధుల కోసం యూనివర్సిటీలు పాటించాల్సిన షరతులు (కొత్త నియమాలు)
విదేశీ విద్యార్థుల పరిమితి: విదేశీ వీసాలపై వచ్చే విద్యార్థుల సంఖ్య 15 శాతానికి మించి ఉండకూడదు. అలాగే, ఒకే దేశం నుంచి వచ్చిన విద్యార్థుల సంఖ్య 5 శాతానికి మించకూడదు.
నిధుల వెల్లడి: విదేశాల నుంచి యూనివర్సిటీలకు అందే నిధుల వివరాలను తప్పనిసరిగా బహిర్గతం చేయాలి.
అడ్మిషన్లలో వివక్ష నిషేధం: విద్యార్థుల అడ్మిషన్, ఆర్థిక సాయం (Financial Aid) సమయంలో లింగం, జాతి, జాతీయత, రాజకీయ భావజాలం, జెండర్ ఐడెంటిటీ, లైంగిక ఆకర్షణ, మతపరమైన అంశాలు పరిగణనలోకి తీసుకోకూడదు.
ప్రామాణిక పరీక్ష తప్పనిసరి: అండర్ గ్రాడ్యుయేట్ దరఖాస్తుదారులు కచ్చితంగా SAT లేదా ACT వంటి ప్రామాణిక పరీక్ష (Standardized Test) పూర్తిచేయాల్సిందే.
విద్యా స్వేచ్ఛ: విద్యా స్వేచ్ఛను కాపాడే విధానాలను అమలుచేయాలి. సంప్రదాయవాద ఆలోచన సరళిని ఇబ్బందిపెట్టే, దాడులకు పాల్పడే యూనిట్లను తొలగించాలి.
రాజకీయ ప్రదర్శనలపై నియంత్రణ: విద్యాలయాలను ఇబ్బందిపెట్టేలా రాజకీయ ప్రదర్శనలు, విద్యార్థులను లేదా గ్రూపులను వేధించకుండా చర్యలు చేపట్టాలి.
ఉద్యోగులకు మార్గదర్శకాలు: ఉద్యోగులు అధికారిక విధుల సమయంలో రాజకీయ ప్రసంగాలు, చర్యలకు దూరంగా ఉండాలి.
లింగ ఆధారిత మరుగుదొడ్లు: బాత్‌రూమ్‌లు, లాకర్ రూమ్‌లు లింగ ఆధారంగా వేర్వేరుగా ఉండాలి.
హార్డ్ సైన్స్ ప్రోత్సాహం: హార్డ్ సైన్స్ (సైన్స్, ఇంజనీరింగ్ వంటివి) విద్యను అభ్యసించే విద్యార్థులకు ఉచిత ట్యూషన్ ఫీజు, ప్రోత్సాహకం కింద $2 మిలియన్లు మించి ఇవ్వాలని ప్రతిపాదించారు.
ఈ నిబంధనలకు అంగీకరించి, వాటిని అమలు చేసినట్లయితేనే యూనివర్సిటీలకు ప్రభుత్వ లబ్ధిలో ప్రాధాన్యం లభిస్తుంది.