Ramchandra Rao: తెలంగాణలో 2028లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావడమే తమ లక్ష్యమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు స్పష్టం చేశారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయాలు సాధించిందని, అదే ఉత్సాహంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపు సాధించడానికి బీజేపీ కృషి చేస్తుందని తెలిపారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రజల నుండి ఓట్లు అడిగే అర్హత లేదని రామచందర్ రావు విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రూ. 40 వేల కోట్ల విలువైన ఎరువులను రాయితీపై అందిస్తున్నా, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువుల కొరతను అరికట్టడంలో విఫలమైందని ఆయన ఎద్దేవా చేశారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంపై నిందలు మోపడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ కట్టుబడి ఉన్నదని, ఈ దిశగా నిరంతరంగా కృషి చేస్తామని రామచందర్ రావు స్పష్టం చేశారు.