Vishal Brahma

Vishal Brahma: రూ. 40 కోట్ల విలువైన డ్రగ్స్‌ స్మగ్లింగ్‌.. బాలీవుడ్ నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్

Vishal Brahma: బాలీవుడ్ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్‌ ది ఇయర్‌ 2’లో నటించిన నటుడు విశాల్ బ్రహ్మ (Vishal Brahma) డ్రగ్స్‌ అక్రమ రవాణా కేసులో అరెస్టయ్యారు. సింగపూర్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న విశాల్‌ను డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.40 కోట్ల విలువైన 3.5 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సినీ అవకాశాలు లేక.. డ్రగ్స్ రవాణా
పోలీసులు, డీఆర్‌ఐ అధికారుల ప్రాథమిక విచారణ ప్రకారం, అస్సాంకు చెందిన విశాల్ బ్రహ్మకు ఇటీవల సినీ అవకాశాలు సరిగా రాకపోవడంతో తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. ఈ ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అతను డబ్బు సంపాదించడానికి నైజీరియాకు చెందిన ఒక ముఠాకు స్నేహితుల ద్వారా పరిచయమయ్యాడు.

నైజీరియా ముఠా విశాల్ బ్రహ్మను లక్ష్యంగా చేసుకుని, అతనికి కాంబోడియా ట్రిప్‌ను ఏర్పాటు చేసి, అన్ని ఖర్చులూ తామే భరిస్తామని ఆశ చూపింది. దానికి బదులుగా, ఇండియాకు తిరిగి వచ్చేటప్పుడు మాదకద్రవ్యాలను చేరవేస్తే కొంత నగదు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుంది.

Also Read: Allu Sirish: అల్లు శిరీష్ నిశ్చితార్థం ఫిక్స్! నా జీవితంలోకి ఆమె.. పోస్ట్ వైరల్!

ఈ ఒప్పందంలో భాగంగా, రెండు వారాల క్రితం విశాల్ ఢిల్లీ నుంచి కాంబోడియాకు వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు ఒక నైజీరియన్ అతనికి డ్రగ్స్ దాచి ఉంచిన ఒక ట్రాలీ బ్యాగ్‌ను ఇచ్చాడు. ఈ కొకైన్‌ను సింగపూర్ మీదుగా చెన్నైకి, ఆ తర్వాత చెన్నై నుంచి రైలు మార్గంలో ఢిల్లీకి చేర్చాలని ముఠా రూట్ మ్యాప్ ఇచ్చింది.

అయితే, డ్రగ్స్‌ వ్యవహారం గురించి ముందుగానే సమాచారం అందుకున్న డీఆర్‌ఐ అధికారులు, చెన్నై విమానాశ్రయంలో విశాల్ బ్రహ్మ లగేజీని తనిఖీ చేయగా, సూట్‌కేస్‌లో తెల్లటి పొడితో నిండిన ప్లాస్టిక్ సంచులు కనిపించాయి. వాటిలో 3.5 కేజీల కొకైన్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విశాల్ బ్రహ్మను రెడ్‌హ్యాండెడ్‌గా అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ డ్రగ్స్ రవాణా వెనుక ఉన్న నైజీరియా గ్యాంగ్‌పై కూడా దృష్టి సారించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *