Chandrababu

Chandrababu: రైతు ఆదాయం పెంచడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: సీఎం చంద్రబాబు

Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం విజయనగరం జిల్లా, దత్తిరాజేరు మండలం, దత్తి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, లబ్ధిదారులకు పింఛన్లను అందించారు. అనంతరం ప్రజావేదికలో గ్రామ ప్రజలతో మాట్లాడారు.

ప్రపంచంలోనే అత్యుత్తమ ఆర్థిక భరోసా..
ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి పింఛన్లు అందిస్తోందని తెలిపారు. గత 16 నెలల్లో పేదలకు మొత్తం రూ.48,019 కోట్లు ఇచ్చామని వెల్లడించారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు అందిస్తూ, దానిని **’పింఛన్ల పండుగా నిర్వహిస్తున్నామని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా తమ ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోందని చెప్పారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 63 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని, అందులో 59 శాతం మంది మహిళలే ఉన్నారని వివరించారు. ఎన్డీయే ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో అగ్రస్థానంలో ఉందని పేర్కొన్నారు. గతంలో ఒక నెల పింఛను తీసుకోకపోతే ఇచ్చేవారు కాదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, తర్వాత నెలలో కూడా తీసుకోవచ్చని, ప్రస్తుతం ఏపీలో ఎవరికీ ఇబ్బంది లేదని తెలిపారు. పెన్షన్లను ప్రారంభించింది టీడీపీ ప్రభుత్వమేనని, ఆనాడు ఎన్టీఆర్‌ గారు రూ.30తో మొదలుపెట్టిన పింఛను సొమ్మును పది రెట్లు పెంచిన ఘనత తమకే దక్కుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందిస్తున్నామని, ప్రతి నెలా ఒక గ్రామానికి వచ్చి తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని, అందులో భాగంగానే ఈ రోజు దత్తి గ్రామానికి వచ్చానని తెలిపారు.

Also Read: KNL Aluru TDP Incharge: ఆలూరులో సైకిల్‌ పార్టీ చరిత్రను ఆమె తిరగరాస్తారా?

‘సూపర్‌ సిక్స్‌’ విజయవంతం: మహిళా సాధికారత కీలకం
ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సూపర్‌ సిక్స్‌’ పథకాలు సూపర్‌ హిట్‌ అయ్యాయని ప్రకటించారు. మహిళలను అన్ని రంగాల్లోని పైకి తీసుకురావడానికి కృషిచేస్తున్నామని తెలిపారు.

తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలున్నా తల్లికి ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు.

ఆడబిడ్డలు కష్టపడకూడదనే ఉద్దేశంతో, ఆనాడు దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, ఇప్పుడు ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పారు.

స్త్రీశక్తి పథకం (ఉచిత బస్సు ప్రయాణం): ఆడబిడ్డలు ఆర్థికంగా ఎదగాలన్నదే తమ ఉద్దేశమని, ఏపీ మహిళలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం కావాలని ఆకాంక్షించారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించిన ఈ పథకం ఒక ‘గేమ్‌ ఛేంజర్‌’ అని పేర్కొన్నారు. పథకం ప్రారంభించిన 45 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 10 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని, ఒకప్పుడు పది లక్షల మందే బస్సులు ఎక్కేవారని, ఇప్పుడు ఆ సంఖ్య డబుల్‌ అయిందని వివరించారు.

డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చింది కూడా టీడీపీ ప్రభుత్వమేనని, డ్వాక్రా రుణాలు తీసుకున్న ఆడబిడ్డలు తిరిగి కడుతున్నారని, పెద్ద పెద్ద వాళ్లు రుణాలు కట్టకపోయినా ఆడబిడ్డలు మాత్రం తిరిగి చెల్లిస్తున్నారని ప్రశంసించారు.

Also Read: Delhi: గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు

రైతులకు, యువతకు భరోసా
ఆదాయాన్ని పెంచడం కోసం కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోందని సీఎం అన్నారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతు ఆదాయం పెరగాలని తెలిపారు. గతంలో ఎవరూ రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. విజయనగరం జిల్లా పేదరికంలో ఉన్నా, తగినంత సాగునీరు లేకపోయినా కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. రైతు భరోసా కింద ఇప్పటికే ఒక్కో రైతుకు రూ.6 వేలు వేశామని, ఇంకా రూ.14 వేలు వేస్తామని తెలిపారు.

యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదని, తాను వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మెగా డీఎస్సీ నిర్వహించి, ఉద్యోగ నియమక పత్రాలు ఇచ్చామని చెప్పారు. ఈ 15 నెలల్లో 4,71,574 మందికి ఉద్యోగాలు ఇచ్చామని, ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, తద్వారా 9 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఆటో డ్రైవర్లకు, పేదలకు ఎదురయ్యే ఇబ్బందులు తనకు తెలుసని, అందుకే అక్టోబర్‌ 4న ఆటో డ్రైవర్లకు రూ.15 వేల సాయం అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

చివరగా, 2024 ఎన్నికల్లో జగన్‌ ఓటమితో ప్రజలకు మళ్లీ స్వాతంత్ర్యం వచ్చిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తాను జగన్‌లా తుగ్లక్‌ని కాదని, మంచి పాలన చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో జగన్ పర్యటనకు వస్తే చెట్లు నరికేవారని, ప్రజలు మీటింగ్‌ల నుంచి వెళ్లకుండా గోతులు తవ్వేవారని, ప్రజలు నవ్వడానికి వీలు లేకుండా జగన్ పాలన చేశారని ఆయన విమర్శించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *