Minor Rape Case: చిత్తూరు జిల్లా మురకంబట్టు ప్రాంతంలో మైనర్ బాలికపై జరిగిన ఘోరమైన అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం రేపుతోంది. సెప్టెంబర్ 25న నగరవనం పార్క్‌కు వెళ్లిన ప్రేమజంటను ముగ్గురు దుండగులు అడ్డుకుని, మొదట విలువైన వస్తువులు దోచుకున్నారు. అనంతరం ప్రియుడిని బెదిరించి బంధించి, మైనర్ బాలికపై ఒకరి తర్వాత మరొకరు అమానుషానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై బాధిత యువకుడు సెప్టెంబర్ 29న చిత్తూరు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలిని కౌన్సిలింగ్‌కు హాజరుచేసి, వన్‌స్టాప్ సెంటర్లో మహిళా అధికారుల సమక్షంలో స్టేట్మెంట్ రికార్డు చేశారు. అనంతరం బాధితురాలి తల్లిదండ్రులను కలసి వివరాలు సేకరించారు.
ఈ కేసులో Cr.No.129/2025 కింద POCSO చట్టం, SC/ST అట్రాసిటీ చట్టం తదితర సెక్షన్లపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, పరారీలో ఉన్న నిందితులు మహేష్, కిషోర్, హేమంత్ ప్రసాద్‌లను పట్టుకోవడానికి గాలింపు ప్రారంభించారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించారు. అదే సమయంలో బాధితురాలి వివరాలను ఎవరూ బయటపెట్టరాదని, వదంతులు వ్యాప్తి చేయరాదని పోలీసు అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Heavy Rain Alert: ఆరంజ్ అలెర్ట్.. వచ్చే మూడు భారీ వర్షాలు..!
అయితే, ఈ ఘటనపై రాజకీయ వాదోపవాదాలు ముదురుతున్నాయి. నిందితులు ఏ పార్టీకి చెందినవారన్న దానిపై అధికార–ప్రతిపక్షాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. నిందితులు గత ఐదేళ్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు విజయానంద రెడ్డి వద్ద పనిచేసినవారని, వారికి సంబంధించిన ఫోటోలను టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ విడుదల చేశారు. దీనికి ప్రతిస్పందించిన వైసీపీ శ్రేణులు, ఆ ముగ్గురు నిందితులు గత నెల 25వ తేదీన టీడీపీలో అధికారికంగా చేరారని, ఆ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా కండువా వేసి పార్టీలో ఆహ్వానించారని చెబుతూ వీడియోలు, ఫోటోలను విడుదల చేశారు.