Sabarimala

Sabarimala: అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుంటే ఇంటికే ప్రసాదం

Sabarimala:  కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయం దేశవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక కేంద్రం. ప్రతి ఏడాది నవంబర్ నుండి జనవరి వరకు 41 రోజుల దీక్షను పాటించి లక్షలాది మంది భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి వస్తారు. మాంసాహారాన్ని మానుకోవడం, మద్యం సేవించకపోవడం, బ్రహ్మచర్యం పాటించడం వంటి నియమాలతో ఈ యాత్ర కొనసాగుతుంది. జనవరి 14న జరిగే మకరవిళక్కు సందర్భంలో మకరజ్యోతి దర్శనం భక్తులకు లభించడం ప్రత్యేక ఆకర్షణ. అంతేకాక ప్రతి మలయాళ నెలలో మొదటి ఐదు రోజులు కూడా స్వామి దర్శనం కోసం ఆలయం తెరవబడుతుంది.

ఆన్‌లైన్‌లోనే ప్రసాదం బుకింగ్‌

ఇంతటి విశిష్టత కలిగిన ఆలయంలో లభించే ప్రసాదం కూడా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే రద్దీ కారణంగా ప్రసాదం కోసం భక్తులు ఎక్కువ సమయం క్యూలైన్‌ల్లో గడపాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు (TDB) వినూత్న నిర్ణయం తీసుకుంది. ‘కౌంటర్ బిల్లింగ్ మాడ్యూల్’ అనే కొత్త ఆన్‌లైన్‌ వ్యవస్థను ప్రవేశపెట్టి, ఇకపై భక్తులు ఇంటి నుంచే ప్రసాదం బుక్ చేసుకునే వీలును కల్పించింది.

ఇది కూడా చదవండి: IndiGo Flight: ముంబై-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపులు

ఇక భక్తులు ఆలయానికి నేరుగా వెళ్లలేని పరిస్థితుల్లో కూడా ఆన్‌లైన్‌ ద్వారా ప్రసాదం ఆర్డర్ చేసి, కొరియర్‌ సాయంతో స్వగృహంలోనే స్వామివారి ప్రసాదాన్ని అందుకోవచ్చు. ఒక నెల రోజుల్లో ఈ సదుపాయం ప్రజలకు అందుబాటులోకి రానుంది.

1252 దేవాలయాలకు విస్తరణ

ప్రస్తుతం ఈ సౌకర్యం శబరిమల ఆలయానికి మాత్రమే అందుబాటులోకి రానున్నప్పటికీ, వచ్చే ఆరు నెలల్లో ట్రావెన్‌కోర్ పరిధిలోని 1252 దేవాలయాలకు విస్తరించాలనే లక్ష్యంతో దేవస్వం బోర్డు ముందుకు సాగుతోంది. కొట్టారక్కర శ్రీ మహాగణపతి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని కేరళ ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ ప్రారంభించగా, దేవస్వం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ మాట్లాడుతూ– “శబరిమల వంటి రద్దీగా ఉండే దేవాలయాలకు నేరుగా వెళ్లలేని భక్తులకు ఇది ఎంతో ఉపయోగకరం. త్వరలో అన్ని ప్రధాన ఆలయాలకు ఈ సదుపాయం విస్తరించబడుతుంది” అన్నారు.

భక్తులకో వరం

ఈ నిర్ణయంతో ఇకపై భక్తులు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే అయ్యప్ప స్వామివారి దివ్య ప్రసాదాన్ని పొందే అవకాశం కలిగింది. డిజిటల్‌ యుగంలో భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ చర్య నిజంగా ఆధ్యాత్మిక ప్రపంచానికి ఒక పెద్ద ముందడుగుగా భావిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *