Canada: లారెన్స్ గ్యాంగ్ ఉగ్రవాద సంస్థ

Canada: భారత్‌కు చెందిన కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నేతృత్వంలోని ముఠాపై కెనడా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. ఈ గ్యాంగ్‌ను అధికారికంగా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. హత్యలు, కాల్పులు, దహనం, బెదిరింపులు వంటి చర్యల ద్వారా ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

కెనడా ప్రజా భద్రతా శాఖ మంత్రి గ్యారీ ఆనందసంగరి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ – బిష్ణోయ్ ముఠా ప్రధానంగా భారత్ నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ, కెనడాలో కూడా తన ఉనికిని విస్తరించిందని పేర్కొన్నారు. ముఖ్యంగా కెనడాలో స్థిరపడిన ప్రవాస భారతీయులపై, వారి వ్యాపారాలపై, ప్రముఖులపై ఈ ముఠా దాడులు చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించిందని తెలిపారు

క్రిమినల్ కోడ్ కింద బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద జాబితాలో చేర్చడం వల్ల, కెనడాలో ఉన్న ఆ ముఠాకు చెందిన ఆస్తులు, వాహనాలు, బ్యాంక్ ఖాతాలు స్తంభింపజేయడం లేదా స్వాధీనం చేసుకోవడం సాధ్యం అవుతుంది. అంతేకాకుండా, ఈ సంస్థకు నిధులు సమకూర్చడం, కొత్త సభ్యులను చేర్చుకోవడం వంటి చర్యలు తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయని మంత్రి స్పష్టం చేశారు.

“కెనడాలో నివసించే ప్రతి ఒక్కరికీ భద్రతతో జీవించే హక్కు ఉంది. బిష్ణోయ్ గ్యాంగ్ కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడుతోంది. దీనిని ఉగ్రవాద జాబితాలో చేర్చడం ద్వారా, మా భద్రతా సంస్థలు మరింత శక్తివంతంగా వీరిని ఎదుర్కొనే అవకాశం పొందుతాయి” అని గ్యారీ ఆనందసంగరి తెలిపారు. ఈ నిర్ణయం వలస, శరణార్థుల రక్షణ చట్టాల ప్రకారం దేశంలోకి ప్రవేశించే వారిపై నియంత్రణ చర్యలు తీసుకోవడంలోనూ సహాయపడుతుందని ప్రభుత్వం వివరించింది.

ఇటీవలి కాలంలో కెనడాలో కపిల్ శర్మకు చెందిన రెస్టారెంట్‌పై కాల్పులు, ఇతర వ్యాపారాలపై దాడులు, బెదిరింపులు చేసినట్టు బిష్ణోయ్ గ్యాంగ్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ పరిణామాలే కెనడా ప్రభుత్వాన్ని ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకునేలా చేశాయని సమాచారం.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *