Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారు. ఈ పర్యటనలో ఆయన కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని రాక, రాష్ట్రంలో రాజకీయంగా, అభివృద్ధి పరంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
శ్రీశైల మల్లన్న దర్శనం
ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. శివుడి దర్శనం తర్వాత, కర్నూలు చేరుకుంటారు.
కూటమి నేతలతో రోడ్‌షో, భారీ ర్యాలీ
కర్నూలులో ప్రధాని మోదీతో కలిసి కూటమిలోని ముఖ్య నేతలు… అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒక భారీ రోడ్‌షోలో పాల్గొననున్నారు.
ముఖ్యంగా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) సంస్కరణల గురించి ప్రజలకు వివరించడానికి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా జీఎస్‌టీ కారణంగా సామాన్య ప్రజలకు, వ్యాపారులకు కలిగే ప్రయోజనాలను ఈ వేదికపై నుంచి నేతలు తెలియజేయనున్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో పలు ముఖ్యమైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు, అలాగే కొన్ని ప్రారంభోత్సవాలలో పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.
మంత్రి నారా లోకేశ్ ఈ పర్యటన వివరాలను శాసనమండలి లాబీలో ఇతర మంత్రులు, ఎమ్మెల్సీల వద్ద ప్రస్తావించారు. దీంతో ప్రధాని రాక విషయం అధికారికంగా వెల్లడైంది. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని చాటేందుకే ఈ పర్యటన ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.