Amaravati: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. వైద్యుల ప్రకారం, జ్వరం తీవ్రత తగ్గకపోవడంతో పాటు, దగ్గు ఎక్కువగా ఉండటంతో ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ కారణంగా ఇవాళ వైద్య పరీక్షల నిమిత్తం పవన్ కళ్యాణ్ మంగళగిరి నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
సీఎం చంద్రబాబు ట్వీట్
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, సోషల్ మీడియా ప్లాట్ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు.
“అనారోగ్యంతో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవలు అందించడానికి, అలాగే విస్తృతంగా ప్రశంసలు అందుకుంటున్న OG మూవీ విజయాన్ని ఆస్వాదించడానికి మెరుగైన ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆశిస్తున్నాను” అని సీఎం తన ట్వీట్లో పేర్కొన్నారు.
అభిమానుల్లో ఆందోళన
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా ఆయన అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు ఆరోగ్యం కుదుటపడాలని శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.