Hyderabad Rains: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గురువారం అర్ధరాత్రి నుంచి వాన ఎడతెరిపి లేకుండా దంచి కొడుతోంది. ఈ భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాతావరణ శాఖ మరో కొన్ని గంటలు వాన కొనసాగే అవకాశం ఉందని హెచ్చరించింది.
నగరంలో ట్రాఫిక్ జామ్, లోతట్టు ప్రాంతాలు జలమయం
నగరవ్యాప్తంగా రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. దీని వల్ల ముఖ్య కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు, తక్కువ ఎత్తులో ఉన్న కాలనీలలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు
హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి సహా మొత్తం 25 జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడుతోంది. కొన్ని చోట్ల గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఐటీ ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రొం హోమ్’ సూచన
భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ పోలీసులు కీలక సూచన జారీ చేశారు. ముఖ్యంగా ఐటీ కారిడార్ పరిధిలోని కంపెనీ ఉద్యోగులకు నేడు, రేపు (సెప్టెంబర్ 26, 27) తప్పనిసరిగా వర్క్ ఫ్రొం హోమ్ (WFH) అవకాశం ఇవ్వాలని ఐటీ కంపెనీలను కోరారు. దీని వల్ల రోడ్లపై రద్దీ తగ్గి, ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని భావిస్తున్నారు.
Also Read: New Liquor Shops: తెలంగాణలో మద్యం షాపుల పండుగ షురూ.. దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచే!
రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు కీలక ఆదేశాలు
భారీ వర్షాల పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులను అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
సీఎం ఇచ్చిన ముఖ్య ఆదేశాలు:
* కలెక్టర్లు హై అలర్ట్: అన్ని జిల్లాల కలెక్టర్లు హై అలెర్ట్‌లో ఉండి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలి.
* లోతట్టు ప్రాంతాల తరలింపు: లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ముందుగానే తరలించాలని, అవసరమైతే వారిని సురక్షితమైన పునరావాస కేంద్రాలకు చేర్చాలని ఆదేశించారు.
* ట్రాఫిక్ నియంత్రణ: రోడ్లపై నీరు నిలిచిన చోట వెంటనే ట్రాఫిక్‌ను నిలిపివేయాలని సూచించారు.
* విద్యుత్ సరఫరాపై దృష్టి: విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ వహించి, అంతరాయం లేకుండా కరెంటు సరఫరా కొనసాగించాలని చెప్పారు. వేలాడే విద్యుత్ వైర్లను తక్షణమే తొలగించాలని ఆదేశించారు.
* ప్రాణ నష్టం నివారణ: ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలి.
* విద్యాసంస్థలు అప్రమత్తం: దసరా సెలవులు ఉన్నప్పటికీ, విద్యాసంస్థలు అప్రమత్తంగా ఉండాలి.
ప్రస్తుతం హైదరాబాద్‌లో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల కోసం సిద్ధంగా ఉన్నాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దని ప్రభుత్వం కోరుతోంది.