Telangana: తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నమై ఉన్నది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ చేపడుతున్నది. గతంలోనే పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటరు జాబితాల సిద్ధం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, బాక్సులు సంసిద్ధం చేసి ఉంచారు. దీంతో ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు అంతా రెడీ చేసి ఉంచారు.
Telangana: ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై అంతటా ఉత్కంఠ నెలకొని ఉన్నది. పోలింగ్ ఎప్పుడు? రిజర్వేషన్లు ఎలా? అన్న అంశాలపైనా తీవ్ర ఆసక్తి నెలకొని ఉన్నది. పరిషత్ ఎన్నికలు ముందా? పంచాయతీ ఎన్నికలు ముందా? అన్న విషయంలోనూ ఉత్సుకత ఉన్నది. దీంతో వివిధ రాజకీయ పక్షాలు, ఔత్సాహిక నాయకులు ఎన్నికల గోదాములోకి దూకేందుకు సిద్ధమై ఉన్నారు.
Telangana: స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను అధికారవర్గాలు చేపట్టాయి. విధి విధానాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సంబంధిత జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీవోలు, గ్రామాల్లోని వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు పూర్తిచేసి ఉంచారు.
Telangana: దీంతో స్థానిక ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించాలని కొన్ని జిల్లాల కలెక్టర్లు, మూడు దశల్లో నిర్వహించాలని సమస్యాత్మక గ్రామాలున్న జిల్లాల కలెక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటన్నింటినీ క్రోడీకరించిన ప్రభుత్వం రెండు దశల్లో నిర్వహించేందుకే మొగ్గుచూపుతుందని భావిస్తున్నారు. ఇదే దశలో ఈ నెల (సెప్టెంబర్) 29న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్టు అధికార వర్గాల సమాచారం.