Revanth Reddy

Revanth Reddy: కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు!

Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు. ఇష్టానుసారంగా పరిపాలన చేసేవారు ఎవరైనా ట్రంప్ అవుతారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్‌ను ట్రంప్‌తో పోల్చిన సీఎం రేవంత్
ఢిల్లీలో పెట్టుబడులను ఆకర్షించే పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా 12వ వార్షిక సదస్సులో పాల్గొన్నారు. ‘విజన్ తెలంగాణ రైజింగ్ 2047’ అనే అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

“పరిపాలన చేయాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరం. తెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవారు. తెలంగాణ ప్రజలు ఆ ట్రంప్‌ను పక్కన పడేశారు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

“ఇష్టారాజ్యంగా పరిపాలన నడిపించేవారు ఎవరైనా ట్రంప్ అవుతారు. రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే, మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం ఎక్కువ రోజులు నడవదు” అని కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాకే నష్టం కలిగించాయని గుర్తు చేశారు.

పెట్టుబడుల కోసం సీఎం పిలుపు
అమెరికా వంటి దేశాలు వద్దంటున్న సంస్థలు భారతదేశానికి, ముఖ్యంగా తెలంగాణకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. “హార్వర్డ్, స్టాన్ఫోర్డ్ వంటి సంస్థలతో మాట్లాడుతాను. అమెరికా కాదంటున్న సంస్థలు ఇండియాకి రావాలి. తెలంగాణకు వెల్కమ్ చెబుతున్నాం. అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం. తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెట్టండి” అని పారిశ్రామికవేత్తలను కోరారు.

భవిష్యత్ తరాల కోసం అవకాశాలు సృష్టించడమే తమ లక్ష్యమని సీఎం తెలిపారు. తెలంగాణలో అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని, మెట్రో రెండో దశ, మూసీ రివర్ డెవలప్‌మెంట్, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం వంటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టామని చెప్పారు. హైదరాబాద్‌ను కల్చరల్ హబ్‌గా మార్చడానికి గుళ్లు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల నిర్మాణాలపై కూడా దృష్టి పెడుతున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, 2027 నాటికి హైదరాబాద్‌లో ఈవీ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తామని, అందుకు రాయితీలు కూడా ప్రకటించామని తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *