Suryapet: ఐదు నెలలుగా జీతం రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
జరిగింది ఏమిటంటే..
సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న మధుసూదన్ గత ఐదు నెలలుగా జీతాలు అందక ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారడం, అప్పులు తీర్చలేకపోవడంతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక, జీవితంపై విరక్తి చెంది తన ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ఆయనను సూర్యాపేట జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ సంఘటనతో ఆసుపత్రిలో తోటి ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల నిరుపేద ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.