CM Revanth Reddy: దసరా వెళ్లింది.. దీపావళీ వెళ్లిపోయింది.. ఇక డిసెంబర్ 7, సంక్రాంతి పర్వదినం మిగిలి ఉన్నాయి. మరి ఆ రోజుల్లోనైనా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా? ఊరిస్తుందా? అన్నది తేలాల్సి ఉన్నది. తెలంగాణ క్యాబినెట్‌లో 12 మంది మంత్రులు ఉన్నారు. ఇంకా ఆరుగురు మంత్రులకు అవకాశం ఉన్నది. తొలి నుంచి ఇగో విస్తరణ, అగో విస్తరణ అంటూ ఊరిస్తూ వస్తున్నారు. ఆశావహుల సంఖ్య పెరుగుతూ ఉన్నది. కానీ, మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగడం లేదు. అసలు ఇప్పట్లో జరిగేనా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
పదేండ్ల తర్వాత అధికారంలోకి వచ్చాం.. పదవులు దక్కుతాయన్న ఆనందం.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అందని ద్రాక్షగానే మిగిలింది. ఇప్పటికి 10 సార్లకు పైగా క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, ఇక విస్తరణే మిగిలిందని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యరీతిలో ఊహించని విధంగా ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూ వస్తున్నది. ఇటీవలే దీపావళి తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి సైతం చెప్పారు. కానీ దీపావళి ముగిసి 10 రోజులు కావస్తున్నది. ఆశావహులంతా తమ ప్రయత్నాల్లోనే ఉన్నారు.
ముఖ్యంగా ఎంపీ ఎన్నికల తర్వాతే ఉంటుందని భావించగా, కాంగ్రెస్ 8 స్థానాలకే పరిమితం కావడంతో సీఎం రేవంత్‌రెడ్డి భవితవ్యంపై పార్టీ అధిష్టానం ఆలోచనలో పడ్డట్టు విశ్వసనీయ సమాచారం. ఈ దశలోనే పార్టీ సీనియర్లు రేవంత్‌రెడ్డి వైఖరిపై, పాలనా అంశాలపై అధిష్ఠానానికి చేరవేసినట్టు గుసగుసలు. దీంతో ఆయన ప్రాధాన్యాన్ని తగ్గించాలని కూడా కోరినట్టు తెలిసింది. దీంతోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆచీతూచీ అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రచారం జరుగుతుంది.
CM Revanth Reddy: మంత్రివర్గ విస్తరణ, ఇతర పనుల కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఓ 10 సార్లు ఢిల్లీకి వెళ్లి ఉంటారని విశ్లేషకులు చెప్తుంటారు. ఇక ఈ విషయంపై ఆయన వెళ్లడమే మానేశారని తేల్చేశారు. ఇవ్వాల్సిన పేర్ల జాబితాను ఇచ్చిన ఆయన తన భారం తగ్గించుకున్నారని అంటారు. అయితే హైకమాండ్ వద్ద ఏవో అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయని రేవంత్ వర్గీయుల అనుమానం. రేవంత్‌రెడ్డి ప్రాధాన్యతను పెంచకుండా ఉండేందుకు, ఆయన చెప్పిన వారికి మంత్రి పదవులు ఇవ్వ వద్దని రాష్ట్ర సీనియర్ నేతలు అధిష్ఠానం వద్ద ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం జరుగుతున్నది.
ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నందున కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ బిజీగా ఉన్నది. ఇప్పట్లో విస్తరణను పట్టించుకోక పోవచ్చు. పర్యవసనాలు ఉంటాయన్న ఉద్దేశంతో విస్తరణ అంశం కూడా వాయిదా పడే అవకాశం ఉన్నది. దీన్నిబట్టి మరో నెలరోజులు పట్టే అవకాశం ఉన్నది. ఆ తర్వాత ఎప్పుడు ఉంటుందా అంటే డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది అవుతుంది. డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం ఉంటుంది. ఈ రెండు తేదీల్లో జరగకుంటే జనవరి నెలలో వచ్చే సంక్రాంతి పర్వదినాన ఉంటుందని ఆశావహులు ఆశలు పెట్టుకోవచ్చు.