Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన వర్షాలు మళ్లీ మొదలయ్యాయి. గతంలో వచ్చిన వరదలు, నష్టాల నుంచి ఇంకా కోలుకోకముందే, పలు జిల్లాల్లో మళ్లీ భారీ వర్షాలు మొదలయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాబోయే మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
దక్షిణ అంతర కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉత్తర-దక్షిణ ద్రోణి విస్తరించి ఉండడమే ఈ వర్షాలకు ప్రధాన కారణం. దీని ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల వాతావరణ సూచనలు ఇలా ఉన్నాయి.
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం
* నేడు: ఈ రోజు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు పడవచ్చు. గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచవచ్చు.
* రేపు, ఎల్లుండి: తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్
* నేడు: ఇక్కడ కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. బలమైన గాలులు, మెరుపులతో జాగ్రత్తగా ఉండాలి.
* రేపు, ఎల్లుండి: తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.
రాయలసీమ
* నేడు: ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడవచ్చు. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, బలమైన గాలుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
* రేపు: అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలుల ప్రభావం కొనసాగుతుంది.
* ఎల్లుండి: అనేక చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముంది.
వచ్చే మూడు రోజులు వాతావరణం అస్థిరంగా ఉంటుంది కాబట్టి, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిది. రైతులు, సామాన్య ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.