Delhi: దుబాయ్‌లో ఆదివారం జరగనున్న భారత్–పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌పై దేశవ్యాప్తంగా వ్యతిరేక స్వరాలు ఉధృతమవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయిన విషాదం తాజాగా ఉండగానే, పాక్‌తో క్రికెట్ ఆడటం దేశానికి అవమానకరమని అఖిల భారత సినీ కార్మికుల సంఘం (AICWA) తీవ్రంగా విమర్శించింది.
అమరవీరుల త్యాగాలకు అవమానం
“మన పౌరులను పాక్ ఉగ్రవాదులు మతం అడిగి మరీ కుటుంబాల ముందే దారుణంగా హతమార్చారు. ఈ గాయం ఇంకా పచ్చిగానే ఉంది. అలాంటి సమయంలో పాకిస్థాన్‌తో మ్యాచ్ నిర్వహించడం అమరవీరుల త్యాగాలను అవమానించడం తప్ప మరొకటి కాదు” అని సినీ కార్మికుల సంఘం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
బీసీసీఐపై విమర్శలు
కేవలం డబ్బు కోసం బీసీసీఐ దేశ గౌరవాన్ని పక్కనబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, క్రీడల ముసుగులో ఉగ్రవాద దేశంతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది. ఇది పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి బలైన సైనికులు, పౌరుల పట్ల చేసిన ద్రోహమని సంఘం స్పష్టం చేసింది.
ప్రధానికి విజ్ఞప్తి
ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తక్షణమే జోక్యం చేసుకుని మ్యాచ్‌ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేసింది. సినీ పరిశ్రమలోని నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు కూడా ఈ మ్యాచ్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిచ్చింది. దేశభక్తి కంటే లాభాలను ముందుకు పెడుతున్న బీసీసీఐ చర్యలను ప్రజలు బహిష్కరించాలని కోరింది
గతంలోనూ కఠిన నిర్ణయాలు
గమనించదగ్గ విషయం ఏమిటంటే, గతంలో పాకిస్థాన్ కళాకారులపై నిషేధం విధించి, వారు నటించిన భారతీయ చిత్రాలను కూడా బహిష్కరించాలని ఇదే సంఘం పిలుపునిచ్చింది. మరోవైపు, ఐసీసీ లేదా ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్వహించే టోర్నమెంట్లలో పాక్‌తో ఆడటం తప్పనిసరి అని, ద్వైపాక్షిక సిరీస్‌లను మాత్రమే భారత్ దూరంగా ఉంచుతోందని మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, గతంలో 1986లో శ్రీలంకలో జరిగిన ఆసియా కప్‌ను, 2008లో పాకిస్థాన్‌లో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ భద్రతా కారణాలతో బహిష్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.