Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై రాష్ట్రంలోని అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ ఎన్నికల కోసం ఇప్పటికే తుది ఓటరు ముసాయిదా జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఈ నెల మూడో వారంలోనే తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇదే నెల (సెప్టెంబర్) నెలాఖరులోనే ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు అందినట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
Jubilee Hills Bypoll: దీపావళి పర్వదినం తర్వాత పోలింగ్ జరిగే అవకాశం ఉన్నది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఉప ఎన్నికలో విజయం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు దృష్టి సారించారు. ఈ ఉప ఎన్నికను అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కీలకంగా భావిస్తున్నాయి.
Jubilee Hills Bypoll: బీహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా విడుదల కానున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు బీహార్ రాష్ట్రంలో రెండు, మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నది. సాధారణంగా ఉప ఎన్నికలను చివరి దశ పోలింగ్‌తో నిర్వహించే సంప్రదాయం కొనసాగుతున్నది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దీపావళి తర్వాత జరుగుతుందనే చర్చ అధికారుల్లో ఉన్నది.