ఆంధ్రప్రదేశ్ కు మరికొన్ని రోజులు వర్షం తప్పకపోవచ్చు. ఏపీ తీరం నుంచి సౌత్ మయన్మార్ వరకూ ద్రోణి విస్తరించి ఉండడమే దీనికి కారణం అని వాతావరణ శాఖ చెబుతోంది. దీనికి మరో రెండు ఆవర్తనాలు తోడు అవబోతున్నాయి. వీటి ప్రభావం వలన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీని ప్రభావంతో ఈరోజు
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆలాగే, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటె సముద్రంలో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది.. మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
నిన్న ఎలా ఉందంటే..
ఏపీలో నిన్న అంటే సోమవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. అయితే, కొన్ని జిల్లాల్లో ఎండ దంచి కొట్టింది. కాకినాడ, డా.బీఆర్ అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం, గుంటూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. అలాగే మిగిలిన జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. కొన్ని చోట్ల ఉదయం అంతా ఎండా తీవ్రంగా ఉంది సాయంత్రానికి పెద్ద వర్షం అకస్మాత్తుగా కురిసింది. ఇక సోమవారం రాత్రి 8 గంటలవరకూ చూసుకుంటే కాకినాడ జిల్లా కాజులూరులో 69 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. అలాగే ఆ తర్వాత మధ్యాహ్నం, సాయంత్రానికి ఉన్నట్టుండి వర్షం పడింది. మొత్తం మీద కాస్త విచిత్రమైన వాతావరణం కనిపిస్తోంది. సోమవారం రాత్రి 8 గంటల వరకు అత్యధికంగా కాకినాడ జిల్లా కాజులూరులో 69 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.