Nepal: నేపాల్‌లో రాజకీయ గందరగోళం రోజురోజుకూ తీవ్రమవుతోంది. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేసినా, దేశంలో ఉద్రిక్తతలు తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశ నియంత్రణ సైన్యం చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
ఆర్మీతో చర్చలు, రాజీనామా నిర్ణయం:
ప్రధాని ఓలీ, నేపాల్ ఆర్మీ చీఫ్ జనరల్ అశోక్ రాజ్ సిగ్దెల్‌తో చర్చలు జరిపినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. దేశంలోని అస్థిర పరిస్థితులను నియంత్రించేందుకు సైన్యం సహాయం కోరినట్లు తెలుస్తోంది. ప్రధాని నివాసం నుంచి సురక్షితంగా బయటకు వెళ్లేందుకు ఓలీ సైనిక సహకారం అడిగారని, అయితే ఆర్మీ చీఫ్ రాజీనామా చేయాలని సూచించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఓలీ రాజీనామా ప్రకటించారు. రాజీనామాతో సైన్యం దేశ నియంత్రణను చేపట్టేందుకు సిద్ధమైనట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.
కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేశారు. అన్ని విమాన సర్వీసులను రద్దు చేశారు. విమానాశ్రయంలో 300 మంది సైనికులను మోహరించారు. మంత్రులను, ఇతర ముఖ్య నాయకులను సైనిక హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Also Read: Bollywood: కోర్టుకెక్కిన ఐశ్వర్య రాయ్ ఎందుకో తెలుసా
నేపాల్‌లో సోషల్ మీడియా నిషేధం, ప్రభుత్వంపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో యువత పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. గత రెండు రోజులుగా కాఠ్‌మాండూలో జరిగిన ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోమవారం జరిగిన అల్లర్లలో 19 మందికి పైగా మరణించగా, వందలాది మంది గాయపడ్డారు. నిరసనకారులు ప్రధాని నివాసంపై దాడి చేసి నిప్పు పెట్టారు. నేపాలీ కాంగ్రెస్ నాయకుడు షేర్ బహదూర్ దేఉబా ఇంటిని ధ్వంసం చేశారు. పార్లమెంట్ భవనంలోకి చొరబడి, మంత్రులు, మాజీ ప్రధానుల ఇళ్లపై దాడులు జరిగాయి.
ఈ ఘటనల నేపథ్యంలో హోం మంత్రి రమేష్ లేఖక్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో శాంతి భద్రతలను నియంత్రించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. ప్రస్తుతం నేపాల్‌లో రాజకీయ, సామాజిక పరిస్థితులు అత్యంత సున్నితంగా ఉన్నాయి.

