TGPSC: టీజీపీఎస్సీ ఇతర పరీక్షల తుది ఫలితాలు వస్తున్నాయి.. మేము రాసిన గ్రూప్ 4 తుది ఫలితాలు రావడమే లేదు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయి మూడు నెలలు కావస్తున్నా అతీగతీ లేదు. మాకన్నా వెనుకే జరిగిన డీఎస్సీ, ఇతర పరీక్షల్లో అభ్యర్థుల ఎంపికే జరిగిపోయింది. 1:3 చొప్పున సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. 1:1 తుది ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. బ్యాక్‌లాగ్ పోస్టులు మిగలకుండా భర్తీచేస్తే మాలో మరో 2,500 నుంచి 3,000 మంది వరకు ఉద్యోగాలు పొందుతారు? లేదంటే బ్యాక్‌లాగ్‌తో ప్రభుత్వం మళ్లీ ఖాళీలుగా చూపాలని చూస్తుంది. ఇది భావ్యం కాదు.. అంటూ గ్రూప్ 4 అభ్యర్థులు వేడుకుంటున్నారు.
నెలలు గడుస్తున్నా ప్రభుత్వం గ్రూప్ 4 తుది ఫలితాలను ప్రకటించకపోవడంతో అభ్యర్థులు కలవరపాటుకు గురవుతున్నారు. ఉద్యోగం వస్తుందా? రాదా? ఒకవేళ వస్తే సరే.. లేకుంటే మరో పరీక్షకైనా చదవాలంటే మానసికంగా కుదరడం లేదని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తన ఉద్యోగాల భర్తీ ఖాతా ప్రకటించుకోవడం కోసం తమను బలి చేస్తున్నదని మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: KTR: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం
TGPSC: ఫలితాలు రాక రగిలిపోతున్న గ్రూప్ 4 అభ్యర్థులు ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళనలకు దిగారు. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరసనలకు దిగారు. గాంధీభవన్‌లో నిరసన తెలిపారు. మంత్రులకు వినతిపత్రాలను అందజేశారు. ప్లకార్డులతో తమ నిరసనను వ్యక్తం చేశారు. కమిషన్ చైర్మన్‌కు వేలాది మంది అభ్యర్థులు లేఖలు రాశారు. నిన్న అశోక్‌నగర్‌లో సివిల్స్ మెయిన్స్ అభ్యర్థులకు నగదు సాయం అందించేందుకు వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసేందుకు వెళ్తే పోలీసులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గోడు చెప్పుకునేందుకు వెళ్తే అడ్డుకోవడమేంటి అని తెలిపారు.
ఎన్నికల ముందు తమ వద్దకే వచ్చిన కాంగ్రెస్ నేతలు.. ఇప్పుడు మంత్రులయ్యాక ముఖం చాటేయడం సరికాదని అంటున్నారు. ఎందుకు తమ పట్ల మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులు మిగలకుండా చూడాలని ప్రభుత్వ పెద్దలకు మొర పెట్టుకుంటున్నారు. అన్‌విల్లింగ్ ఆప్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే వివిధ పైస్థాయి ఉద్యోగాల్లో గ్రూప్ 4 అభ్యర్థులు చేరిపోయారని, వారి స్థానాల్లో తర్వాత మెరిట్ ప్రకారం పిలువాలని కోరుతున్నారు. లో
TGPSC: 3 వేల వరకు బ్యాక్‌లాగ్ పోస్టులు మిగిలే అవకాశం ఉన్నదని, 1:3లో ఉన్నవారితోనే భర్తీ చేయాలని వేడుకుంటున్నారు. ప్రభుత్వం మొండివైఖరిని వీడి వెంటనే తుది ఫలితాలను విడుదల చేసి తమ మనోవేదనను తీర్చాలని కోరుతున్నారు. ప్రభుత్వం మాత్రం ఏడాది పూర్తయ్యే డిసెంబర్ 7 నాటికి ఫలితాలను ఇస్తుందని అంటున్నారు. లేకుంటే వచ్చే వచ్చే ఏడాది ఉద్యోగాల కల్పన లెక్కల్లో వేసుకునేందుకు 2025లోనే ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉన్నదని విశ్లేషకులు చెప్తున్నారు.