Afghanistan Earthquake

Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం.. 800 మందికి పైగా మృతి

Afghanistan Earthquake: అఫ్గానిస్థాన్ మరోసారి ప్రకృతి విపత్తు బారినపడింది. ఆదివారం అర్ధరాత్రి పాకిస్థాన్‌ సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని కునార్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.0 తీవ్రత నమోదైన ఈ భూకంపం కేవలం కొన్ని సెకన్లలోనే అనేక గ్రామాలను శిథిలాలుగా మార్చింది. యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం, నంగర్హార్ ప్రావిన్స్‌లోని జలాలాబాద్ సమీపంలో 8 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11:47 గంటలకు భూమి కంపించిందని అధికారులు తెలిపారు.

తాలిబాన్ ప్రభుత్వం 800 మందికి పైగా మరణించారని, 2500 మందికిపైగా గాయపడ్డారని ధృవీకరించింది. గాయపడిన వారిని నంగర్హార్, కునార్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భూకంపం సంభవించి 20 నిమిషాలకే 4.5 తీవ్రతతో మరోసారి భూకంపం సంభవించినట్లు పేర్కొన్నారు.

Also Read: RCB: తొక్కిసలాట సంఘటన… RCB కీలక నిర్ణయం!

కునార్, నోరిస్థాన్, నంగర్హార్ రాష్ట్రాల్లోని గ్రామాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి. అనేక ఇళ్లు కూలిపోవడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. చిన్నారులు ఆకలితో విలవిల్లాడుతుండగా, వృద్ధులు గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. మహిళలు వైద్య సాయం కోసం కేకలు వేస్తున్నారు. వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ సోషల్ మీడియాలో స్పందిస్తూ, “ఈ విపత్తు వల్ల ప్రజలు ఆశ్రయం కోల్పోయారు. తక్షణమే ఆహారం, వైద్యం, నివాసం అందించాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ సంస్థలు వెంటనే ముందుకు రావాలి” అని పిలుపునిచ్చారు.

క్రికెటర్ రహ్మానుల్లా గుర్బాజ్ కూడా భూకంప బాధితులపై సంతాపం వ్యక్తం చేశారు. “మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి” అని ప్రార్థించారు. సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. శిథిలాల కింద నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి. ప్రతి ఇంట్లోనూ విలాపమే వినిపిస్తోంది. ఈ విపత్తు కేవలం అఫ్గానిస్థాన్ ప్రజలకే కాకుండా, మానవాళికే దుఃఖాన్ని మిగిల్చింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *