Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు ఈ పేరు కి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు. అయన పేరు వినగానే చేసిన అభిరుద్ది , భవిష్యత్ ని చంద్రబాబు ఎలా చూస్తున్నాడు అనే అతని విజన్ ముందుగా గుర్తుకు వస్తుంది. అన్నీ అనుకూలిస్తే అధికారాన్ని అందుకోవడం కష్టమేమీ కాదు. కానీ ప్రతికూలతల మధ్య ఆ అధికారాన్ని సాధించడం గొప్ప సవాలు. ఓటములు, అవమానాలు ఎదురైనా పట్టుదలతో గెలిచి ముందుకు సాగడమే అసలైన నాయకత్వం. ఈ లక్షణాలన్నీ కలగలసిన నేత నారా చంద్రబాబు నాయుడు.
1995 సెప్టెంబరు 1న తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు, నేడు ముప్పై ఏళ్ల రాజకీయ ప్రయాణంలో విశిష్ట మైలురాళ్లు నెలకొల్పారు. నాటి హైటెక్ సిటీ కల నుంచి నేటి “స్వర్ణాంధ్ర విజన్ 2047” వరకు ఆయన ముందుచూపే ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు తెచ్చింది.
మొదటి అడుగుతోనే సుపరిపాలన
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే వ్యవస్థను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా “ప్రజల వద్దకు పాలన”, “జన్మభూమి”, “నీరు-మీరు”, “పచ్చదనం-పరిశుభ్రత” వంటి పథకాల ద్వారా పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. హైటెక్ సిటీ నిర్మాణం, మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు ఆహ్వానించడం ద్వారా ఐటీ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు.
మహిళా శక్తి – పేదరిక నిర్మూలన దిశగా
డ్వాక్రా స్వయంసహాయక సంఘాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించారు. “వెలుగు” పథకం ద్వారా గ్రామీణ పేదరికాన్ని తగ్గించారు. ఈ కార్యక్రమాలు అప్పటి నుంచి రాష్ట్ర అభివృద్ధికి పునాది రాళ్లయ్యాయి.
రెండోసారి సీఎం – కష్టకాలంలోనూ కదలని ధైర్యం
1999లో రెండోసారి సీఎంగా ప్రమాణం చేసిన చంద్రబాబు, వరుస కరువులు, విద్యుత్ ధరల పెంపు, ప్రజా ఉద్యమాల మధ్యనూ సుపరిపాలనను కొనసాగించారు. రైతుల కోసం “రైతు బజార్లు” ఏర్పాటు చేసి మధ్యవర్తుల దోపిడీని అరికట్టారు. “కోటి వరాలు” పథకం ద్వారా బలహీన వర్గాలకు అండగా నిలిచారు.
విభజన అనంతరం సవాళ్లు
2014లో విభజన తర్వాత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టారు. అమరావతి రాజధాని కలను ఆవిష్కరించారు. పోలవరం, నదుల అనుసంధానం, పట్టిసీమ వంటి ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలని కృషి చేశారు. అయితే 2019లో పరాజయం ఎదుర్కొని ఐదేళ్లు ప్రతిపక్షంలో గడిపారు.
మళ్లీ ప్రజా తీర్పు – నాలుగోసారి సీఎం
2024 ఎన్నికల్లో జనసేన, బీజేపీ మిత్రపక్షాలతో కలిసి అఖండ విజయాన్ని సాధించారు. వైసీపీ పాలనలో కూలిపోయిన రాష్ట్రాన్ని తిరిగి పటిష్టం చేయడం, సంక్షేమం-అభివృద్ధికి సమతౌల్యం తీసుకురావడం ఆయన ముందున్న పెద్ద సవాళ్లు.
30 ఏళ్ల మైలురాయి
1995 నుంచి ఇప్పటివరకు 5,442 రోజులు సీఎంగా సేవలందించిన చంద్రబాబు, ఈరోజు 5,443వ రోజుకు అడుగుపెట్టారు. ఆయన రాజకీయ పయనం కేవలం నాయకత్వ ప్రతిభను కాకుండా పట్టుదల, దూరదృష్టి, సాంకేతికత పట్ల ఆసక్తిని ప్రతిబింబిస్తుంది.

