Harish Rao: కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న చర్చలో మాజీ మంత్రి హరీష్ రావు ఘోష్ కమిషన్‌పై ఆక్షేపణలు వ్యక్తం చేశారు. రిటైర్డ్ ఇంజనీర్ల వేదిక ఇచ్చిన నివేదికను ఘోష్ పట్టించుకోలేదని, అలాగే నిపుణుల కమిటీ సిఫారసులను కూడా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అందుకే ఈ రిపోర్టు పీసీసీ కమిషన్ నివేదికలా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి 2007-08లో టెండర్లు పిలిచి, 2010లో డీపీఆర్ సమర్పించినది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. డీపీఆర్ తప్పు అయితే అప్పట్లో అనుమతులు ఎలా వచ్చాయో కాంగ్రెస్ చెప్పాలని ఆయన ప్రశ్నించారు.
“నిజాలు చెబితే కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది?” అని ప్రశ్నించిన హరీష్ రావు, ఒకే ఏడాదిలో 11 అనుమతులు తెచ్చుకున్నామని వివరించారు. NDSAపై ఇప్పుడు గొప్పలు చెప్పే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ సంస్థపై బిల్లు పార్లమెంట్లో వచ్చినప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదని ఆయన ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు పదిసార్లు కూలిపోయినా NDSA అక్కడ విచారణకు వెళ్లలేదని గుర్తుచేస్తూ, కాళేశ్వరం విషయంలో మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని హరీష్ రావు విమర్శించారు.