JTYL Jeevan Reddy: జగిత్యాలలో రాజకీయ జగడం మరోసారి రాజుకుంది. సొంత పార్టీని ఇరుకున పెట్టే విధంగా మోస్ట్ సీనియర్ నేత జీవన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ చేపట్టిన కాంగ్రెస్ జనహిత యాత్ర జిల్లాలోని చొప్పదండిలో జరిగింది. యాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడ సభలో ఓట్ చోరీ అంశంపై బీజేపీపై హస్తం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన విమర్శలు పొలిటికల్‌గా కాక రేపాయి. అంతా సాఫీగా సాగిందని హస్తం పార్టీ రాష్ట్ర నేతలు సంబరపడుతున్న తరుణంలో జీవన్ రెడ్డి ఎపిసోడ్‌తో అంతా రివర్స్ అయింది. ఇంతకీ జీవన్ రెడ్డి చేసిందేంటి…? అనే వివరాల్లోకి వెళితే… జనహిత యాత్రలో భాగంగా తొలిరోజు పాదయాత్ర, కార్నర్ మీటింగ్ జరిగాయి. జనం నుంచి మంచి స్పందన వచ్చింది. రెండో రోజు శ్రమదానం, అనంతరం ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌కి పీసీసీ ఛీఫ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ అటెండ్ అయ్యారు. నియోజకవర్గాల వారీగా లోకల్‌గా పార్టీ పరిస్థితి ఎలా ఉంది…? ప్రజలు ఏమంటున్నారు…? కార్యకర్తలు ఏమంటున్నారు…? అనే విషయాలను ఆయా మండలాల నేతలను అడిగి తెలుసుకున్నారు పెద్ద నేతలు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో నేతలు తమ నియోజకవర్గాల్లోని తాజా స్థితిగతులు, ప్రతిపక్షాల పరిస్థితిని చెప్పగా, జగిత్యాల నియోజకవర్గం నేతలు మాత్రం ఆత్మస్తుతి, పరనింద అన్నట్టుగా జీవన్ రెడ్డిని పొగుడుతూ పార్టీ నేతలను విమర్శిస్తూ మాట్లాడారు. దీంతో సమావేశంలో కాస్త గందరగోళం నెలకొంది. వారిని సముదాయించి సమావేశాన్ని ముగించి బయటకు వెళుతున్న తరుణంలో జీవన్ రెడ్డి సహా జగిత్యాల కార్యకర్తలు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను రౌండప్ చేసి జగిత్యాలలో జీవన్ రెడ్డి పరిస్థితి ఏంటి…? తమకు అన్యాయం జరిగిందని నిలదీశారు. అక్కడితో ఆగకుండా ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు, జగిత్యాలలో సీట్ చోరీ జరిగిందని.. దాని మాటేంటని కార్యకర్తలు అడగడంతో ఆయన నిశ్చేష్టుడయ్యారు. పక్కనే ఉన్న జీవన్ రెడ్డి కార్యకర్తలను వారించాల్సింది పోయి, వారిని రెచ్చగొట్టే విధంగా జెండాలు మోసిన మేము అన్యాయం అవుతున్నాం అనడంతో మరింత రెచ్చిపోయారు కార్యకర్తలు. ఈ లోగా ఇతర నేతలు కలగజేసుకోవడంతో మహేష్ కుమార్ గౌడ్ బయటకు వచ్చారు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది.
తెలంగాణలోనూ ఓట్ చోరీ జరిగిందని ఆరోపించి సంచలనం రేపిన మహేష్ కుమార్ గౌడ్‌కు సీట్ చోరీ అంటూ జీవన్ రెడ్డి అనుచరులు అన్న కౌంటర్లు ప్రతిపక్షాలకు ఆయుధంగా మారాయి. బండి సంజయ్‌ను టార్గెట్ చేసిన మహేష్ గౌడ్‌కు సొంత పార్టీ నేతల వల్ల సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టయిందట. జీవన్ అనుచరులు చేసిన సీట్ చోరీ కామెంట్‌తోనే బండి సంజయ్ పీసీసీ ఛీఫ్‌పై అటాక్ చేశారు. దీంతో తమ యాత్ర బాగా జరిగిందన్న సంతోషం లేకుండా చేశారని జీవన్ రెడ్డిపై రగిలిపోతున్నారట రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. అయితే పెద్దలు జీవన్ రెడ్డికి ఇలా సొంత పార్టీని ఇరుకున పెట్టడం కొత్తేమీ కాదు. ఓ రెండు నెలలు మౌనంగా ఉండటం, ఉన్నట్టుండి ఒక్కసారిగా ఏదో బాంబు పేల్చడం కామన్‌గా మారిందట ఆ పెద్దాయనకు. పదవీకాలం ముగిసినా కాస్త సైలెంట్‌గా ఉన్నాడని అనిపించినప్పటికీ ఈ మధ్య వీలు చిక్కిన ప్రతీసారీ తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ తన ఉనికి గుర్తించండి అన్నట్టుగా అధిష్టానానికి సంకేతాలు ఇస్తున్నారట జీవన్.
Also Read: Telangana: కామారెడ్డిలో వరద ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్సీల బృందం పర్యటన
చాలా సీనియర్ నేతగా పేరున్న జీవన్ రెడ్డి ఇప్పుడు పార్టీకి తట్టుకోలేని తలనొప్పిగా మారారని చెవులు కొరుక్కుంటున్నారట హస్తం పార్టీ నేతలు. ఇప్పటికే పలుమార్లు అలకపాన్పు అస్త్రాన్ని ప్రయోగించారు ఈ సీనియర్ నేత. అసలే పెద్దమనిషి, అప్పట్లో ఎమ్మెల్సీ కాబట్టి పార్టీ నేతలు కూడా మొదట్లో సీరియస్‌గా తీసుకుని పెద్దలు జీవన్ రెడ్డి గారు అంటూ బుజ్జగింపుల పర్వం స్టార్ట్ చేసి ఆయనకు ఏదో ఒక ప్రామిస్ చేసి కూల్ చేసేవారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవీకాలం అయిపోయింది. రెన్యూవల్ అవుతుందని భావించిన ఆయనకు నిరాశే మిగిలింది. మరోవైపు అలక బూనితే అధిష్టానం ఖాతరు చేయడం లేదట. తన అనుచరుడి హత్యను అడ్వాంటేజ్ తీసుకోవాలని అనుకున్నాడట. అదీ వికటించింది. ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ధర్నాకు యత్నించినా ఫలితం లేకుండా పోయిందట. ఇటీవల నామినేటెడ్ పదవులు, నియోజకవర్గానికి నిధుల మంజూరు విషయంలో తన మార్క్ చూపించాలనుకుంటే భంగపాటే మిగిలిందట. దీంతో బహిరంగంగానే ఆక్రోశాన్ని వెళ్లగక్కుతూ రగిలిపోతున్నారు జీవన్ రెడ్డి. ఇలా ఒక్కో ఘటన అగ్నికి ఆజ్యం పోసినట్టు చేసాయట. అన్ని విషయాల్లోనూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌కే ప్రాధాన్యత దక్కుతుండటంతో ఏం చేయాలి అని దీర్ఘాలోచనలో పడ్డారట జీవన్ రెడ్డి. అలా వచ్చిన ఆలోచనల నుంచే ఇలా రాష్ట్ర నేతలను ఇరుకున పెట్టాలనే ప్రణాళికలు అమలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది హస్తం పార్టీ సర్కిల్స్‌లో.
రాష్ట్ర వ్యాప్తంగా ఫిరాయింపులపై ఓ వైపు హాట్‌హాట్‌గా చర్చ సాగుతున్న తరుణంలో ఈ ఎపిసోడ్ ఎటు దారితీస్తుంది అనేది ఆసక్తికరంగా మారిందట. మరోవైపు లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటు పార్టీలో… అటు నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై అప్పర్ హ్యాండ్ సాధించేందుకు జీవన్ రెడ్డి కొత్త ప్రణాళికలను సిద్ధం చేసుకున్నారట. అందులో భాగంగానే జిల్లా కార్యకర్తల సమావేశంలో దృష్టిని తనవైపు మళ్లించుకునేందుకు కార్యకర్తలను ఇలా ప్రయోగించారట. సమావేశానికి ఎమ్మెల్యే సంజయ్ దూరంగా ఉన్న విషయాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకుని తన ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపేందుకు… అటు పార్టీలో జీవన్ రెడ్డికి ఫాలోయింగ్ ఉందని తెలిసేలా చేయాలనేది ఆయన ప్లాన్ అని చర్చించుకుంటున్నారు నేతలు. రాబోయే స్థానిక ఎన్నికల్లో తన వారికి టికెట్లు కేటాయింపు విషయంలో ఈ వ్యవహారం ఉపయోగపడుతుందని ఆయన భావిస్తున్నారట. ఇది ఇలా ఉంటే… ఆయన వ్యవహరించిన తీరుపై రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ, పీసీసీ ఛీఫ్ గుర్రుగా ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయట. ఆయన జగిత్యాలలో రాజేసిన మంటలు చల్లార్చేందుకు పార్టీ పెద్దలు ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తిగా మారింది.

