CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శాసన సభలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్మరణార్థం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు.
గోపీనాథ్ వ్యక్తిత్వం క్లాస్‌గానూ, మాస్ లీడర్‌గా కూడా నిలిచిందని సీఎం రేవంత్ గుర్తుచేశారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్న గోపీనాథ్, 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా పని చేసి విశేష గుర్తింపు పొందారని అన్నారు. ఆ కాలంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావుతో సత్సంబంధాలు కొనసాగించారని ఆయన ప్రస్తావించారు.
విద్యార్థి నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా, సినీ నిర్మాతగా మాగంటి గోపీనాథ్ విశిష్ట స్థానం సంపాదించారని సీఎం పేర్కొన్నారు. తనకు ఆయన మంచి మిత్రుడు, సన్నిహితుడని గుర్తుచేసుకున్నారు.
గోపీనాథ్ 2014, 2018, 2023లో వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధించారని రేవంత్ తెలిపారు. ఆయన అకాల మరణం కుటుంబానికి, ఆయన అభిమానులకు, ప్రజలకు తీరని లోటు అని అన్నారు. మాగంటి కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.