CPCB: ప్రపంచంలోని మానవ ఆరోగ్యం, వాతావరణ మార్పులపై పనిచేస్తున్న లాన్సెట్ అనే సంస్థ భారత్ గురించి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. దీనిలో భారతదేశంలో కాలుష్యం కారణంగా మరణించే వారి సంఖ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల కంటే చాలా ఎక్కువ అని పేర్కొంది. దీనిపై భారత ప్రభుత్వం కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నేతృత్వంలో దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ దర్యాప్తు సంస్థ, తన రిపోర్టులో లాన్సెట్ వాదనలను తప్పుదారి పట్టించేవిగా పేర్కొంది.
దర్యాప్తు సంస్థ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు ఇచ్చిన రిపోర్టులో పలు అభ్యంతరాలు లేవనెత్తింది. లాన్సెట్ రిపోర్ట్ లో చాలా సాంకేతిక లోపాలు ఉన్నాయని, దాని విశ్వసనీయతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని CPCB తెలిపింది. లాన్సెట్ ఇలాంటి రిపోర్ట్స్ తో భారతదేశ ప్రతిష్టను దిగజార్చాలని కోరుకుంటోందని, తద్వారా వాతావరణ మార్పు, కాలుష్యాన్ని ఎదుర్కోవటానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను బలహీనం చేయాలని చూస్తోందని CPCB ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Supreme Court: బుల్‌డోజర్ చర్యలపై కోర్టు సీరియస్.. ఇళ్లను కూల్చడం అరాచకం.. 25 లక్షల రూపాయల నష్టపరిహారం
భారతదేశంలోని పది ప్రధాన నగరాల్లో పేలవమైన గాలి నాణ్యత ప్రజల ఆరోగ్యం,మరణాల రేటుపై తీవ్ర ప్రభావం చూపుతుందని లాన్సెట్ ఒక రిపోర్టులో పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల కంటే వాయు కాలుష్యం కారణంగా మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉందని ఆ రిపోర్టులో ఉంది. దీనిపై ఇప్పుడు భారత్ తీవ్ర అభ్యంతరాన్ని తెలుపుతోంది.