Railway: తెలంగాణలో మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రవాణా వ్యవస్థను అతలాకుతలం చేశాయి. రోడ్లు, వంతెనలతో పాటు రైల్వే మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. వరద నీరు రైల్వే ట్రాక్‌లపైకి చేరడంతో దక్షిణ మధ్య రైల్వే అత్యవసర చర్యలు తీసుకుని పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని మార్గం మళ్లించింది.
రద్దయిన రైళ్లు
బుధవారం కరీంనగర్-కాచిగూడ, కాచిగూడ-నిజామాబాద్, కాచిగూడ-మెదక్, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, ఆదిలాబాద్-తిరుపతి రైళ్లు రద్దు కాగా, గురువారం నిజామాబాద్-కాచిగూడ సర్వీస్‌ను రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే మహబూబ్‌నగర్-కాచిగూడ, షాద్‌నగర్-కాచిగూడ రైళ్లు పాక్షికంగా రద్దు చేశారు.
రైల్వే మార్గాల్లో వరద నీరు
కామారెడ్డి – బికనూర్ – తలమడ్ల, అకన్పేట్ – మెదక్ రైల్వే ట్రాక్‌లపై వరద ప్రవహిస్తోంది. దీంతో ఆ మార్గాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితిని బట్టి రద్దయే రైళ్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Telangana Rains: భారీ నుంచి అతి భారీ వర్షాల.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్
హెల్ప్‌లైన్ నంబర్లు
రైల్వే అధికారులు ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ నంబర్లను విడుదల చేశారు.
-
కాచిగూడ: 9063318082
-
నిజామాబాద్: 970329671
-
కామారెడ్డి: 9281035664
-
సికింద్రాబాద్: 040-27786170
వరద సహాయక చర్యలు
ఇక వరదల ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 1,071 మందిని రక్షించినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. SDRF, NDRF బృందాలు తీవ్రంగా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తూ, మంత్రులు, అధికారులతో నిరంతరం సమీక్ష చేస్తున్నారు. ఎప్పటికప్పుడు అవసరమైన చోట సాయం అందించాలని ఆదేశిస్తున్నారు.

