Rahul Mamkootathil: కేరళ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పలువురు మహిళల లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న పాలక్కాడ్ ఎమ్మెల్యే రాహుల్ మమ్కూటథిల్ను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసింది. గత వారం ప్రముఖ నటి రిని ఆన్ జార్జ్ చేసిన ఆరోపణలతో మొదలైన వివాదం, వరుసగా మరికొంతమంది మహిళలు, ట్రాన్స్ మహిళ అవంతిక బయటకు రావడంతో తీవ్ర దుమారం రేగింది. దీనికి తోడు బీజేపీ, సీపీఎం శ్రేణులు రోడ్డెక్కి నిరసనలు చేపట్టడంతో పార్టీ అధిష్టానం చివరకు ఈ కఠిన నిర్ణయం తీసుకుంది.
ఆరోపణల తుఫాన్
మలయాళ నటి రిని ఆన్ జార్జ్ మూడు సంవత్సరాలుగా తనకు అభ్యంతరకర సందేశాలు పంపారని, హోటల్‌కు పిలిచారని బహిరంగంగా వెల్లడించింది. ఆమె నేరుగా పేరు ప్రస్తావించకపోయినా, బీజేపీ మమ్కూటథిల్పైనే ఆరోపణలు చేశాయి. ఆ వెంటనే రచయిత్రి హనీ భాస్కరన్ కూడా ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. ఇక ట్రాన్స్ మహిళ అవంతికకు ఆయన అత్యాచారం బెదిరింపులు చేసినట్లు ఆరోపించడం మరింత కలకలం రేపింది.
ప్రతిపక్షం దాడి – ప్రజల్లో కలకలం
ఈ ఆరోపణలతో బీజేపీ, సీపీఎం శ్రేణులు మమ్కూటథిల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించాయి. రాష్ట్ర మహిళా కమిషన్, చైల్డ్ రైట్స్ కమిషన్ సీరియస్‌గా స్పందించాయి. మరికొన్ని ఆడియో క్లిప్స్ వెలుగులోకి రావడంతో రాహుల్ పరిస్థితి మరింత క్లిష్టమైంది.
ఇది కూడా చదవండి: Modak Recipe: గణపతికి ఇష్టమైన మోదక్.. సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలంటే ?
కాంగ్రెస్ నిర్ణయం
ఇప్పటికే యూత్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ రాజీనామా చేసినా, విమర్శలు ఆగకపోవడంతో పార్టీ అతన్ని 6 నెలలపాటు సస్పెండ్ చేసింది. దీంతో రాహుల్ పార్టీ సమావేశాలు, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేరు. అయితే పాలక్కాడ్ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా కొనసాగుతారు.
రాజీనామా ఒత్తిడి పెరుగుతోంది
కాంగ్రెస్ మహిళా నాయకులు ఉమా థామస్, మాజీ ఎమ్మెల్యే షానిమోల్ ఉస్మాన్‌తో పాటు ప్రతిపక్ష నేత వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, ఎల్డీఎఫ్ కన్వీనర్ టీపీ రామకృష్ణన్ – అందరూ రాహుల్ తన నైతికతను నిలబెట్టుకోవడానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

