Shamshabad Airport: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నది. భార్యాభర్తలు వంటింట్లోనో, వాకిట్లోనో గొడవ పడతారు. కాసేపయ్యాకే సద్దుమణిగి ఆలుమగలు కలిసి మెలిసి జీవిస్తారు. కొందరు గొడవలు పడి రచ్చకెక్కుతారు. పది మంది చూస్తుండగానే ఒకరికొకరు ఘర్షణ పడతారు.. మళ్లీ కొన్నాళ్లకు కలిసి పోతారు. కానీ, విమానాశ్రయంలో, అదీ విమానం ఎక్కాక భార్యాభర్తలు గొడవకు దిగిన ఈ ఘటనతో అంతా నివ్వెర పోవాల్సి వచ్చింది.
Shamshabad Airport: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన పండిట్, సాక్షి దంపతులు ఇటీవల హైదరాబాద్ నగరానికి వచ్చారు. మళ్లీ భోపాల్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సమయంలోనే ఆ దంపతులు శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కి కూర్చున్నారు. ఇంటి విషయమా? బయటి విషయమో? కానీ ఆ ఇద్దరూ గొడవపడ సాగారు. ఎంతకూ ఆ గొడవ సద్దుమణగలేదు.
Shamshabad Airport: ఈ సమయంలో విమానంలో తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది ఆ దంపతులను వారించారు. వారు ఎంతగా సముదాయించినా ఆ దంపతులు తమ గొడవను మాత్రం ఆపడం లేదు. ఆ దంపతుల వ్యవహారంతో వారందరికీ చిర్రెత్తికొచ్చింది. ఇక చేసేది లేక ఆ ఇద్దరు దంపతులను సిబ్బంది విమానం నుంచి దించేశారు. ఆ తర్వాత మిగతా ప్రయాణికులతో విమానం కదిలి వెళ్లిపోయింది. విమానం దిగాక అయినా ఆ దంపతుల గొడవ సద్దుమణిగిందో? అంటూ ప్రయాణికులు చురకలు అంటించడం కొసమెరుపు.