KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి సహా ఇతర మంత్రులు, ఆ పార్టీ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో బుధవారం మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రంతో అంటకాగుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డిది డబుల్ ఇంజిన్ సర్కార్ అని, దానిలో ఒక ఇంజిన్ అదానీ, మరో ఇంజిన్ ప్రధాని అని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి ఇంటిలోనే కరణ్ అదానీతో నాలుగు గంటల సమావేశం జరిగిందని, వీరికి, వారికీ లోపల ధ్రుడమైన సంబంధాలు ఉన్నాయని విమర్శించారు.
KTR: సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రధాని కోసం దామగుండం అప్పజెప్పాడని, అదానీ కోసం రామన్నపేట అప్పజెప్పాడని, మధ్యలో మూసీని మేఘా కృష్ణారెడ్డికి అప్పజెప్పాడని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. ఒక్కక్కటిగా వీళ్ల బట్టలిప్పి బజారులో నిలబెట్టే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది అని చెప్పారు. దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్టు రాష్ట్ర మంత్రులే రాష్ట్ర సంపదను పంచుకుంటున్నారని ఘాటు విమర్శలు చేశారు.
KTR: కేసీఆర్ తలపెట్టిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని డిజైన్ మార్చి, కొడంగల్-నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ అని మొదలుపెట్టారని, రేవంత్‌రెడ్డి తన ఈస్టిండియా కంపెనీకి, పొంగులేటి తన రాఘవ కన్‌స్ట్రక్షన్‌కి ఇచ్చుకున్నారని విమర్శించారు. మార్కెట్ బాగాలేదని రూ.50 డిస్కౌంట్ ఇచ్చి స్వ్కేర్ ఫీటుకు రూ.100 చొప్పున ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని విమర్శించారు.
KTR: అందరినీ జైలుకు పంపుతామంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపైనా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటి ఐటీసీ కోహినూర్‌లో అదానీ కాళ్లు పట్టుకున్నాడని కేటీఆర్ ఆరోపించారు. వాళ్లు, వీళ్లు జైలుకు పోతారని అంటున్న పొంగులేటియే ఎప్పుడు జైలుకు పోతాడో తెలుసుకోవాలని హెచ్చరించారు.
KTR: గతంలో కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు నుంచి గండిపోచమ్మ నీళ్లు పోయించేందుకు గతంలో తమ ప్రభుత్వం రూ.1,100 కోట్లతో చేస్తామని చెప్పగా, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5,650 కోట్లకు పెంచిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి సర్కారు 4,500 కోట్ల స్కాం చేసేందుకు పన్నాగం పన్నిందని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి ఏది చెప్తే అది తలూపి ప్రాజెక్టులను ఇష్టమొచ్చినట్టు బడ్జెట్లు పెంచితే, రేపు రేవంత్‌రెడ్డి ఉద్యోగం ఊడినప్పుడు, మీ ఉద్యోగాలు కూడా ఉడిపోతాయని ఐఏఎస్, ఇంజినీర్లకు కేటీఆర్ హెచ్చరించారు.
KTR: సుంకిశాల ఘటనలో అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, కాంగ్రెస్ ఎమ్మెల్యే పత్రికలోనే కథనం రాశారని తెలిపారు. ప్రాజెక్టులపైనా అదే పత్రికలో కథనాలు రావడాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. సొంత పార్టీ నేత పత్రికలోనే ప్రభుత్వ విధానాలపై వ్యతిరేక కథనాలు రావడం.. ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలను సూచిస్తున్నదని ఆరోపించారు.