Rahul Sipligunj: ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఎట్టకేలకు ఒక ఇంటివాడయ్యాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అయిన రాహుల్ తన ప్రియురాలు హరిణి రెడ్డితో నిశ్చితార్థం చేసుకుని అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఎన్నో ఏళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఆదివారం (ఆగస్టు 17న) కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.
రాహుల్ సిప్లిగంజ్ ప్రస్థానం
రాహుల్ సిప్లిగంజ్ టాలీవుడ్లో పరిచయం అవసరం లేని పేరు. ఎన్నో సూపర్ హిట్ పాటలు ఆలపించిన రాహుల్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ అవార్డు గెలుచుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొని విజేతగా నిలవడమే కాకుండా, తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. ప్రస్తుతం సినిమా పాటలతో పాటు తన సొంత వీడియో సాంగ్స్‌తో బిజీగా ఉన్నారు.
గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్
రాహుల్, హరిణిల నిశ్చితార్థం హైదరాబాద్‌లో అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు మిత్రులు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన అధికారిక ఫోటోలు ఇంకా విడుదల కాలేదు. కానీ, ఈ కార్యక్రమానికి హాజరైన కొందరు స్నేహితులు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఎంగేజ్మెంట్లో రాహుల్ పాస్టెల్ లావెండర్ షేర్వానీలో మెరిశారు. హరిణి ఆరెంజ్ లెహంగా ధరించి అందంగా కనిపించారు. వేద పండితుల సమక్షంలో ఈ జంట ఒక్కటయ్యారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న రాహుల్, హరిణిలకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

