Narendra Modi: న్యూఢిల్లీలో ఎర్రకోట వేదికగా జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 103 నిమిషాల ప్రసంగం చేశారు. దీంతో ఆయన అరుదైన రికార్డు నెలకొల్పారు. భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి కూడా చేయని అతి పొడవైన ప్రసంగం ఇదే కావడం విశేషం. గత సంవత్సరం అంటే 2024 లో 78వ స్వాతంత్ర్య దినోత్సవం నాటి తన 98 నిమిషాల రికార్డును మోదీ బద్దలు కొట్టారు.
ఇక 2016 లో 96 నిమిషాలు కాగా, అతి చిన్న ప్రసంగం 2017 లో 56 నిమిషాలలో మోదీ ప్రసంగించారు. మోదీ ఈ రికార్డుతో పాటుగా మరో రికార్డు నెలకొల్పారు. ఎర్రకోట నుండి వరుసగా 12 ప్రసంగాలు చేయడం ద్వారా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును కూడా బద్దలు కొట్టారు, వరుసగా 17 స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు చేసిన జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత స్థానంలో మోదీ నిలిచారు. 2014లో తన మొదటి స్వాతంత్ర్య దినోత్సవ రోజున ప్రసంగం చేశారు. దాదాపుగా 65 నిమిషాలు పాటు ఆయన ప్రసంగం కొనసాగింది. 2015లో ఆయన ప్రసంగం 88 నిమిషాలు కొనసాగింది.
ఇది కూడా చదవండి: Alia Bhatt: ఇది మీ ఇల్లు కాదు.. ఫొటోగ్రాఫర్లను గట్టిగా హెచ్చరించిన అలియా భట్
మోడీ కంటే ముందు, 1947లో జవహర్‌లాల్ నెహ్రూ, 1997లో ఐకె గుజ్రాల్ వరుసగా 72, 71 నిమిషాలతో పొడవైన ప్రసంగాలు చేశారు. 1954లో నెహ్రూ, 1966లో ఇందిరా గాంధీ వరుసగా 14 నిమిషాల పాటు అతి తక్కువ ప్రసంగాలు చేశారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్ , అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా ఎర్రకోట నుండి అతి తక్కువ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగాలు ఇచ్చారు. 2012 మరియు 2013లో మన్మోహన్ సింగ్ ప్రసంగాలు వరుసగా 32, 35 నిమిషాలు మాత్రమే కొనసాగాయి. 2002, 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసంగాలు 25, 30 నిమిషాలతో తక్కువతో ముగిశాయి.

