KTR: గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “ఇది బీజేపీకి, కాంగ్రెస్కీ చెంపపెట్టు లాంటి తీర్పు. గతంలో బీజేపీ గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి, మేము సిఫారసు చేసిన ఇద్దరు ఎమ్మెల్సీల నియామకాన్ని అడ్డుకుంది. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ప్రక్రియ ఇంకా పెండింగ్లో ఉండగానే తమకు అనుకూలంగా మరో ఇద్దరి పేర్లు పంపి ప్రజాస్వామ్యాన్ని అవమానించింది” అని ఆరోపించారు.
బీఆర్ఎస్ గతంలో నామినేట్ చేసిన బడుగు, బలహీన వర్గాల నాయకులు దాసోజు శ్రవణ్, సత్యనారాయణ అభ్యర్థిత్వాలను బీజేపీ, కాంగ్రెస్ అడ్డుకున్నారని కేటీఆర్ విమర్శించారు. “రాజ్యాంగానికి గౌరవం లేని ఈ రెండు ఢిల్లీ పార్టీలు ప్రజాస్వామ్య విరుద్ధ చర్యలు ఎంతవరకు సాగుతాయో ఈ తీర్పు చెప్పింది. న్యాయవ్యవస్థకు బీఆర్ఎస్ తరఫున వందనం చేస్తున్నాం” అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

