Viral News: మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఒక షాకింగ్ ఘటన ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. జడ్చర్లలోని ఒక బేకరీలో కొనుగోలు చేసిన కర్రీ పఫ్‌లో ఏకంగా చనిపోయిన పాము పిల్ల బయటపడటం కలకలం సృష్టించింది. ఈ ఘటనతో బయటి ఆహారం తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలనే విషయం మరోసారి రుజువైంది.
జడ్చర్లలోని జౌఖీనగర్‌కు చెందిన శ్రీశైల అనే మహిళ మంగళవారం సాయంత్రం తన పిల్లలను స్కూల్ నుంచి ఇంటికి తీసుకువస్తున్నారు. మార్గమధ్యలో ఆమె ఒక బేకరీలో పిల్లల కోసం ఎగ్‌పఫ్, తన కోసం కర్రీ పఫ్ కొనుగోలు చేశారు. పిల్లలు ఎగ్‌పఫ్‌ను అక్కడే తినగా, శ్రీశైల కర్రీ పఫ్‌ను ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో కర్రీ పఫ్ తింటుండగా, దానిలో ఒక చిన్న పాము పిల్ల కనిపించింది. అది చూసి ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
వెంటనే శ్రీశైల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ బేకరీని సందర్శించి విచారణ చేపట్టారు. ఈ విషయంపై మరింత దర్యాప్తు కోసం ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు సమాచారం అందించారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ నివేదిక ఆధారంగా బేకరీపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సంఘటనతో ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల కాలంలో తెలంగాణతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉత్తర ప్రదేశ్‌లో పరోటాలో బల్లి, పనీర్ కర్రీలో మాంసం ముక్కలు బయటపడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
నిపుణుల ప్రకారం, బయట ఆహారాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసి వండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆహార భద్రత ప్రమాణాలను పాటించకపోవడం వల్ల ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుతున్నాయి. ఈ సంఘటన ఆహార భద్రత ఏజెన్సీలకు, హోటల్, బేకరీ యజమానులకు ఒక హెచ్చరికగా నిలిచింది. కస్టమర్ల ఆరోగ్యం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.