Telugu Student Dies In USA

Telugu Student Dies In USA: అమెరికాలోని చికాగోలో తెలంగాణ విద్యార్థిని మృతి

Telugu Student Dies In USA: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలంగాణ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది. చికాగోలో నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టడంతో మేడ్చల్ జిల్లా, దుండిగల్ కు చెందిన శ్రీజ వర్మ (23) అక్కడికక్కడే మరణించింది. ఈ విషాద ఘటన తెలంగాణలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

ఉన్నత చదువుల కోసం విదేశాలకు..
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ నగర్, గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన శ్రీను రావు పెద్ద కూతురు శ్రీజ వర్మ. ఉన్నత చదువుల కోసం ఏడాది క్రితం అమెరికాలోని చికాగోకు వెళ్లి, అక్కడి ఇల్లినాయిస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎంఎస్ చదువుతున్నారు. అక్కడ అద్దెకు ఒక రూమ్ తీసుకుని ఉంటున్నారు.

నిన్న రాత్రి జరిగిన ఘటన..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీజ రాత్రి భోజనం చేసిన తర్వాత తన అపార్ట్‌మెంట్ పక్కన ఉన్న రెస్టారెంట్‌కు వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన శ్రీజ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) అధికారులకు సమాచారం అందించారు.

కుటుంబంలో విషాదం..
శ్రీజ మృతి వార్త తెలియగానే దుండిగల్‌లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ బిడ్డ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందని ఎన్నో కలలు కన్న కుటుంబానికి ఈ వార్త పిడుగుపాటులా తగిలింది. శ్రీజ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై విచారణ వేగవంతం చేయాలని వారు కోరుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *