AP News: చెయ్యెత్తితే బస్సు ఆపండి.. ప్రయాణికుల సంక్షేమమే ఆర్టీసీ సంక్షేమం.. ఇవి ఒకప్పటి మాటలు. ప్రైవేటు వాహనాల తాకిడితో ఆర్టీసీ సంస్థలు కూడా ఆదాయం కోసం కమర్షియల్ అయినట్టుగా కనిపిస్తున్నది. దీంతో సిబ్బందికి వెసులు బాటు కల్పించడంతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని పలువురు ప్రయాణికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
AP News: తాజాగా జరిగిన ఘటనలో ఎవరిది తప్పో, ఒప్పో పక్కనబెడితే బస్సులో ప్రయాణికులు తక్కువగానే ఉన్నా బస్సు ఆపలేదని ఓ ప్రయాణికురాలి ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. అది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దాడి చేసుకునేంత స్థాయికి చేరింది. ప్రయాణికుల సమక్షంలోనే ఆ ప్రయాణికురాలు, డ్రైవర్ తీవ్ర వాగ్వాదానికి దిగడం విస్మయం కలిగించకమానదు.
AP News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నది. నర్పాల మండలం నడిమివంక గ్రామం వద్ద ఓ మహిళ బస్సు కోసం వేచి ఉన్నది. అనంతపురం నుంచి కల్యాణదుర్గం వైపు వెళ్తున్న బస్సును ఆ మహిళ చెయ్యెత్తినా ఆపకుండా వెళ్లింది. బస్సు నిండుగా ఉంటే వేరు.. కానీ, ఖాళీగానే వెళ్తుంది కదా ఎందుకు ఆపలేదు అని ఆ మహిళ అనుకున్నది.
AP News: ముఖ్యమైన పనిపై వెళ్లాల్సిన ఆ మహిళకు కోపం కట్టలు తెంచుకున్నది. అటుగా వెళ్తున్న ఓ బైక్‌పై వెళ్లి ఆ బస్సును ఓవర్ టేక్ చేసి బస్సును ఆపింది. తను చేయి పెట్టినా బస్సును ఎందుకు ఆపలేదంటూ బస్సు ఎక్కి మరీ డ్రైవర్‌ను ఆ మహిళ నిలదీసింది. ఆ డ్రైవర్ దురుసుగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఇద్దరూ వాగ్వాదానికి దిగారు. పరుషంగా మాట్లాడుకున్నారు.
AP News: ఈ సమయంలో ఆ మహిళ సహనం కోల్పోయి డ్రైవర్‌ను కొట్టినట్టు అక్కడి ప్రయాణికులు తెలిపారు. డ్రైవర్ ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదీ జరిగింది. అయితే ఆర్టీసీ సిబ్బందిపై ఫిర్యాదులు చేస్తే.. గతంలో చర్యలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు సిబ్బందిపై దౌర్జన్యాలకు దిగితే కేసులు పెడుతున్న అధికారులు.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించిన అదే ఆర్టీసీ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో, ఫిర్యాదులు ఎక్కడ ఇవ్వాలో, ఇచ్చినా చర్యలుంటాయో లేవో అని తెలుపకపోవడం గమనార్హం.