IndiGo: విమాన ప్రయాణికులకు అందించే సేవల్లో లోపం కారణంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. ఒక మహిళా ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, తడిసిన సీటును కేటాయించినందుకు గాను ఢిల్లీ వినియోగదారుల ఫోరం ఆ సంస్థకు రూ. 1.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని బాధితురాలికి చెల్లించాలని ఆదేశించింది.
ఈ ఏడాది జనవరి 5 పింకీ అనే మహిళ బాకు నుంచి న్యూఢిల్లీకి ఇండిగో విమానంలో ప్రయాణించారు. ఆ సమయంలో ఆమెకు కేటాయించిన సీటు చాలా అపరిశుభ్రంగా, తడిగా ఉండటంతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ సమస్యను విమాన సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా వారు సరైన సమయంలో స్పందించలేదని, దాంతో అదే సీటులో ప్రయాణించాల్సి వచ్చిందని ఆమె వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదు చేశారు. ఈ అనుభవం తనకు శారీరకంగా, మానసికంగా ఇబ్బంది కలిగించిందని ఆమె పేర్కొన్నారు.
Also Read: Sukanya Samriddhi Yojana: రూ.400 కడితే చాలు.. రూ.70 లక్షల లాభం.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా ?
ఈ ఫిర్యాదుపై ఇండిగో సంస్థ తన వాదనను వినిపించింది. పింకీ అభ్యర్థన మేరకు వెంటనే ఆమెకు మరో సీటు కేటాయించామని, ఆమె సౌకర్యవంతంగా ప్రయాణం పూర్తి చేశారని తెలిపింది. అయితే, వినియోగదారుల ఫోరం ఈ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు. ఈ కేసు విచారణలో భాగంగా, విమానంలో జరిగిన సంఘటనలకు సంబంధించిన రికార్డు అయిన “సిట్యువేషన్ డేటా డిస్‌ప్లే (SDD)” నివేదికను సమర్పించడంలో ఇండిగో విఫలమైందని ఫోరం గుర్తించింది. ఈ సేవా లోపాన్ని తీవ్రంగా పరిగణించి, ప్రయాణికురాలు పడిన అసౌకర్యం, మానసిక వేదనకు గాను రూ. 1.5 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా, పింకీ ఈ కేసు కోసం ఖర్చు చేసిన రూ. 25,000 కూడా తిరిగి చెల్లించాలని ఫోరం ఆదేశించింది. ఈ తీర్పు ప్రయాణికుల హక్కుల పరిరక్షణకు ఒక ఉదాహరణగా నిలిచింది.