Srishti Fertility Case: సృష్టి ఫెర్టిలిటీ ఆసుపత్రికి సంబంధించిన చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో భారీగా మనీలాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. కేసు వివరాలను సమర్పించాల్సిందిగా ఈడీ అధికారులు హైదరాబాద్ పోలీసులకు అధికారికంగా లేఖ రాశారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రత దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించినట్లు విచారణలో తేలింది. ఆమె సుమారు 8 రాష్ట్రాల్లో అక్రమ దందా నడిపినట్లు అధికారులు గుర్తించారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా డాక్టర్ నమ్రత కోట్ల రూపాయల అక్రమాస్తులను కూడబెట్టుకున్నారని ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ కేసులో ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, నమ్రత గ్యాంగ్ అనాథ పిల్లలను, అద్దె గర్భాల ద్వారా పుట్టిన శిశువులను అక్రమంగా విక్రయించిందని పోలీసులు గుర్తించారు. ఈ ముఠా 80 మందికి పైగా పిల్లలను విక్రయించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం ద్వారా సుమారు రూ. 25 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఈడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 30 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
నమ్రత అక్రమంగా సంపాదించిన డబ్బును విదేశాల్లో పెట్టుబడులు పెట్టి ఉండవచ్చని ఈడీ అనుమానిస్తోంది. ఈ కోణంలో కూడా లోతైన దర్యాప్తు జరపడానికి ఈడీ సన్నద్ధమవుతోంది. ఈడీ దర్యాప్తు వల్ల కేసులో మరింత లోతుగా ఉన్న విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసు హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.