Cm revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి భారత రాష్ట్ర సమితి (BRS) అధినేత కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జరిగిన ఒక చిట్‌చాట్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ తీరుపై వ్యంగ్యంగా స్పందించారు.
“కేసీఆర్‌ను నేను జైలుకు ఎందుకు పంపాలి? ఆయన ఇప్పటికే ఫామ్‌హౌస్‌లో ఉన్నారు. అది చర్లపల్లి జైలుతో సమానమే. అక్కడే స్వచ్ఛంద నిర్భంధ జీవితం గడుపుతున్నారు” అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. “ఫామ్‌హౌస్‌కు, జైలుకు పెద్ద తేడా ఏముంది?” అని ప్రశ్నించారు.
BRS పాలనపై విమర్శలు:
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “కేసీఆర్‌ను ఓడించడమే అతనికి పెద్ద శిక్ష” అన్నారు. “విద్వేష రాజకీయాలు చేయడం నాకు నచ్చదు. ప్రజలు ఒక నాయకుడిని తిరస్కరించడం ఆయనకు ఇచ్చిన తగిన శిక్షగా నేను భావిస్తున్నాను” అని స్పష్టం చేశారు.
అలాగే, “BRS నేతలకు నైతికత గురించి మాట్లాడే అర్హత లేదని” మండిపడ్డారు. గతంలో జరిగిన అవినీతి, దుర్వినియోగం, నియంత పాలనలపై ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని ఆయన అన్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సూచన:
రాష్ట్రంలో రాబోయే రాజకీయ పరిణామాలపై స్పందించిన సీఎం రేవంత్, “బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని” తెలిపారు. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశముందని ఆయన సూచించారు.