UPI: దేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీలపై ఛార్జీలు విధించేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఈ నిర్ణయం భవిష్యత్తులో వినియోగదారులపై కూడా ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం యూపీఐ లావాదేవీలకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) లేదు. అంటే వ్యాపారులు, వినియోగదారులు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. కానీ, ఇప్పుడు కొన్ని బ్యాంకులు పేమెంట్ అగ్రిగేటర్ల (పీఏ) నుండి ఛార్జీలను వసూలు చేయడం మొదలుపెట్టాయి. పీఏలు అంటే బిల్‌డెస్క్, రాజోర్‌పే, ఫోన్‌పే, గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ సంస్థలు, ఇవి వినియోగదారులు, వ్యాపారుల మధ్య వారధిగా పనిచేస్తాయి.
బ్యాంకుల నుంచి ఛార్జీల వసూలు :
ఐసీఐసీఐ బ్యాంక్ ఆగస్టు 1 నుంచి పేమెంట్ అగ్రిగేటర్ల నుంచి ఛార్జీలను వసూలు చేయడం మొదలుపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్‌లో ఎస్క్రో ఖాతా ఉన్న పీఏలకు ప్రతి రూ.100 లావాదేవీకి 2 పైసలు (గరిష్టంగా రూ.6) ఛార్జీ విధిస్తోంది.
ఎస్క్రో ఖాతా లేని పీఏలకు ప్రతి లావాదేవీపై 4 బేసిస్ పాయింట్లు (గరిష్టంగా రూ.10) ఛార్జీ వసూలు చేస్తోంది.
ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతా ద్వారా లావాదేవీలు నిర్వహించే వ్యాపారులకు ఈ ఛార్జీలు వర్తించవు.
యాక్సిస్ బ్యాంక్ సహా మరికొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా 6-9 బేసిస్ పాయింట్ల ఛార్జీలను వసూలు చేస్తున్నాయి.
ప్రభుత్వ బ్యాంకులు కూడా 2 నుంచి 10 బేసిస్ పాయింట్ల మధ్య ఛార్జీలు వసూలు చేయాలని యోచిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: Donald Trump: రష్యాపై కోపం.. భారత్‌పై ఆగ్రహం: ట్రంప్ బెదిరింపులు
భారం ఎవరిపై?
ప్రస్తుతం ఈ ఛార్జీలను పేమెంట్ అగ్రిగేటర్లే భరిస్తున్నాయి. కానీ అన్ని బ్యాంకులు ఇలా ఛార్జీలు వసూలు చేయడం మొదలుపెడితే, ఈ భారాన్ని వినియోగదారులకు బదిలీ చేయడం తప్ప మరో మార్గం ఉండదని పీఏలు వాదిస్తున్నాయి.
ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ కూడా “యూపీఐ కోసం అయ్యే ఖర్చులను ఎవరో ఒకరు భరించాలి” అని వ్యాఖ్యానించడం ఈ విషయంలో ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థల జోక్యం అవసరాన్ని సూచిస్తోంది.
ఎందుకీ ఛార్జీలు?
యూపీఐ లావాదేవీలకు మద్దతు ఇవ్వడానికి బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు మౌలిక సదుపాయాల కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నాయి. దీనితో పాటు, ఎన్‌పీసీఐ (NPCI) స్విచ్ ఫీజులు కూడా ఉంటాయి. ఈ ఖర్చులను పూరించడానికి బ్యాంకులు ఇప్పుడు ఛార్జీలు విధించడం మొదలుపెట్టాయి.
జూలై నెలలో యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయిలో రూ.25 లక్షల కోట్లు దాటాయి. అంటే ఒక రోజులో దాదాపు 70 కోట్ల లావాదేవీలు జరిగాయి. ఈ భారీ లావాదేవీల సంఖ్యను నిర్వహించడానికి అయ్యే ఖర్చులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే, భవిష్యత్తులో యూపీఐ వినియోగంపై ఛార్జీల భారం పడే అవకాశం ఉంది.