Donald Trump: ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన కోపాన్ని రష్యాపై మాత్రమే కాకుండా, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై కూడా చూపిస్తున్నారు. ఇప్పటికే 25% వాణిజ్య సుంకాలు విధించిన ట్రంప్, ఇప్పుడు వాటిని మరింత పెంచుతానని బెదిరించారు.
సుంకాల పెంపుపై ట్రంప్ హెచ్చరిక
మంగళవారం (ఆగస్ట్ 5, 2025) సీఎన్‌బీసీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “భారత్ మాకు మంచి వాణిజ్య భాగస్వామి కాదు. ఆ దేశంతో వ్యాపారం చేయడం చాలా కష్టం. వారు మా వస్తువులపై భారీగా సుంకాలు విధిస్తారు. అందుకే మేం వారితో ఎక్కువ వ్యాపారం చేయము. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని అవకాశంగా మలుచుకుని రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తున్న భారత్‌పై వచ్చే 24 గంటల్లో వాణిజ్య సుంకాలు గణనీయంగా పెంచుతాను” అని ఆయన ప్రకటించారు.
భారత్ వైఖరిపై ట్రంప్ అసహనం
ఉక్రెయిన్‌తో మూడేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే సుంకాలు విధిస్తామని ట్రంప్ ప్రపంచ దేశాలను హెచ్చరించారు. అయితే, ట్రంప్ బెదిరింపులను పట్టించుకోని భారత్.. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగించింది. దీంతో ట్రంప్ కోపంతో అమెరికాలో భారత దిగుమతులపై 25% వాణిజ్య సుంకాలు విధించారు.
25% సుంకాలు విధించడంతో భారత్ వెనక్కి తగ్గుతుందని ప్రచారం జరిగింది. కానీ, కేంద్ర ప్రభుత్వం ఈ ప్రచారాన్ని తోసిపుచ్చింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటామని స్పష్టం చేసింది. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ట్రంప్.. ఇప్పటికే విధించిన 25% సుంకాలకు తోడుగా, భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఈ పరిణామం భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.